Rajiv Yuva Vikasam Scheme: ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలపై స్పష్టత
తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్మైనార్టీ, ఈబీసీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్మల్లయ్య భట్టు తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వారికి ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేని వారు మీసేవ ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ నెంబర్‌ను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, 2016 తర్వాత మీసేవా కేంద్రాల ద్వారా జారీ చేయబడిన కుల ధృవపత్రం కలిగిన అభ్యర్థలు దరఖాస్తుచేసుకోవచ్చన్నారు.
మరలా కొత్త కుల ధృవపత్రం కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అభ్యర్థుల సౌకర్యం కోసం మండల, మున్సిపాల్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటిని నింపి సంబంధిత మండల మరియు మున్సిపాల్ ప్రజాపాలన సేవా కేంద్రాలలో అందజేయాలన్నారు. ఇతర సమాచారం కొరకు సంబంధిత మండల, మున్సిపాల్ హెల్ప్, డెస్క్ లను సంప్రదించవచ్చన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.