ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. మత్స్యకారులకు కీలక సూచన!!
చూస్తుండగానే వర్షాకాలం రానే వచ్చింది. ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి
దిశ, వెబ్‌డెస్క్: చూస్తుండగానే వర్షాకాలం రానే వచ్చింది. ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు వీస్తుండటంతో నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో విజయనగరం, పార్వతీపురం మన్యం, గుంటూరు, బాపట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల కోసం సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది.