తెలంగాణపై రాహుల్ గురి.. ఉత్కంఠ రేపుతున్న మీటింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్గత సమస్యలతో ఇరకాటంలో పడిన కాంగ్రెస్‌లో పరిస్థితి హీటెక్కింది. రాష్ట్రంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ
దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్గత సమస్యలతో ఇరకాటంలో పడిన కాంగ్రెస్‌లో పరిస్థితి హీటెక్కింది. రాష్ట్రంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టి పెట్టడంతో.. నేతల్లో ఆయోమయం నెలకొంది. మొన్నటిదాకా ఎవరు ఏం మాట్లాడినా అంటీముట్టనట్టు ఉన్న ఏఐసీసీ.. ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. రాష్ట్ర పార్టీలో నెలకొన్న వివాదాలపై నివేదికలు కోరారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోళ్లపై సైతం ఏఐసీసీ స్థాయిలో స్పందిస్తున్నారు. ఏకంగా రాహుల్ గాంధీ ట్వీట్ చేయడంతో పార్టీలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల రాష్ట్ర పార్టీ నేతలు.. రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ధాన్యం అంశాన్ని అనుకూలంగా తీసుకునేందుకు రాహుల్‌తో చర్చించారు. ఇదే సమయంలో అసమ్మతి నేతల అంశంపైనా చర్చించారు. దీంతో ఈ నెల 4న (సోమవారం) ఏఐసీసీ కీలక భేటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిచింది. ఎంపీలు, టీపీసీసీ కార్యవర్గంతో పాటుగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, ఏఐసీసీ బాధ్యులను ఆహ్వానించారు. అసలు రాహుల్ తో మీటింగ్ ఎలా ఉంటుందోనని పార్టీలో ఉత్కంఠగా మారింది.
వింటారా.. వినిపిస్తారా..?
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకంతో పార్టీలో కొత్త జోష్ వస్తుందని అంచనా వేసిన పార్టీ అధినాయకత్వానికి ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు మింగుడు పడటం లేదు. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన సమయం నుంచి సీనియర్లు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. పలు సందర్భాల్లో సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ, వీహెచ్, పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓపెన్ గానే రేవంత్ పైన విమర్శలు చేసారు. ఇదే సమయంలో పార్టీలోని నేతలందరినీ కలుపుకుపోవటంలో రేవంత్ విఫలమవుతున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వీహెచ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లాయలిస్ట్ ఫోరం అనే పేరుతో జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కమలాకర్‌రావు సమావేశం నిర్వహించడం వివాదాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. కొంతమంది ఇలా బహిరంగంగా విమర్శలకు దిగుతుంటే.. మరోవైపు సీనియర్ నేతలు సీఎల్పీ భట్టి, జానారెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, చిన్నారెడ్డి, అంజన్ కుమార్, మహేశ్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు సైలెంట్ అయ్యారు. వీరి మౌనం కూడా అసంతృప్తివాదులకు సపోర్టు అనే తరహాలో మారింది.
ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ సోమవారం నిర్వహించే సభ ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలు అంశాలను ఉదహరిస్తూ అసంతృప్తి నేతలు నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ కోసం ఏం చేశారో, రేవంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న తీరును వివరించేందుకు ప్లాన్ వేస్తున్నారు. కానీ, రాహుల్ గాంధీ మీటింగ్‌లో ఎంత మేరకు అవకాశం వస్తుందోననే ఆందోళన వెల్లడవుతోంది. ఇప్పటికే ఏఐసీసీ నుంచి రేవంత్‌రెడ్డికి మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతూనే ఉంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో పాటుగా పలువురు ఢిల్లీ నేతలు రేవంత్‌పై అసంతృప్తి నేతల విమర్శలను పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఇటీవల ఈ నేతలు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించినా.. ఏఐసీసీ నుంచి ఒక్కరి అపాయింట్మెంట్ కూడా రాలేదు. ఈ పరిణామాల్లో రేవంత్‌పై ఎలా గురి పెట్టాలో సీనియర్లకు కొంత ఆయోమయంగానే మారింది. అసలు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలు వింటారా.. లేకుంటే రాహుల్‌తో పాటుగా ఏఐసీసీ పెద్దలు చెప్పేదే విని రావాల్సి ఉంటుందా అనేది సందేహంగా మారింది. గతంలో రాహుల్‌తో సమావేశమైన సందర్భాల్లో అసంతృప్తి నేతల విమర్శలును పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఒకటీ, రెండు పర్యాయాలు రాష్ట్ర నేతల అభిప్రాయాలు విన్నప్పటికీ.. పెద్దగా ఫాయిదా కనిపించలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ముందు తమ గొంతు విప్పే చాన్స్ ఉంటుందా.. లేదా అనేది సీనియర్లకు అంతు చిక్కడం లేదు.
రాష్ట్రంపై రాహుల్ గురి
ఇటీవల ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఢీలా పడినప్పటికీ.. ముందు ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా తెలంగాణపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న వడ్ల వార్ ను కాంగ్రెస్ పట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని లేఖలు, రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన రాయబేరాలను కాంగ్రెస్ పార్టీ విమర్శలకు వాడుతోంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ.. తెలంగాణ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. అంతేకాకుండా ఈ నెల, లేదా వచ్చేనెలలో రాష్ట్రానికి రప్పించేందుకు టీపీసీసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటే.. రాహుల్ ఇక్కడకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. సోమవారం జరిగే సమావేశంలో దీనిపై ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ముందుగా రాష్ట్ర నేతలకు ఒక స్పష్టమైన హెచ్చరిక చేసి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా పోరాటానికి సిద్ధం కావాలనే విధంగా రాహుల్ సమావేశం ఉండనుంది.
35 మందికి పిలుపు
ఢిల్లీ నుంచి శనివారం రాత్రి వరకు పలువురు నేతలకు ఆహ్వానం అందింది. ఏఐసీసీ తరుపున ఉన్న రాష్ట్ర నేతలు, ఏఐసీసీ కార్యక్రమాల ఇన్ చార్జ్ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌తో పాటుగా ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, సంపత్ కుమార్ తదితరులను పిలిచారు. అదేవిధంగా ఎంపీలతో పాటుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా, సీనియర్లు జానారెడ్డి, చిన్నారెడ్డి, టీపీసీసీ పీఏసీ చైర్మన్ షబ్బీర్ అలీ, పీఏసీ ప్రతినిధులు, క్రమశిక్షణా కమిటీ, పార్టీ ఎమ్మెల్యేలు ఇలా.. మొత్తం 35 మంది నేతలను ఢిల్లీకి పిలిచారు. అసంతృప్తివాదులుగా సమావేశం నిర్వహించిన వీహెచ్, జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డికి సైతం పిలుపు వచ్చింది. దీంతో పలువురు శనివారం సాయంత్రమే ఢిల్లీకి వెళ్లగా.. మరికొందరు ఆదివారం రాత్రి వరకు వెళ్లనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా.. వెళ్లడంపై అనుమానాలు నెలకొన్నాయి.