SHE TEAM : గత నెల రోజుల్లో 283 మంది పోకిరీలను పట్టుకున్న రాచకొండ షీ టీమ్స్

బాలికలు, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.

Update: 2024-10-01 13:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బాలికలు, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్‌ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడించే, వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ, వారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.

షీ టీమ్స్ రాచకొండ పరిధి ఏరియాలో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి, గణేష్ మండపాల వద్ద, గణేష్ నిమజ్జనం చెరువుల వద్ద, రోడ్డు మీద వెళ్తున్న, ఇతర సందర్భాల్లో మహిళలు, ఆడపిల్లలను వేదిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న 283 మంది పోకిరీలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి, వారికి ఎల్‌బీనగర్ సీపీ క్యాంప్ ఆఫీస్‌లో కౌన్సిలర్స్‌తో తాాజాగా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ డీసీ‌పీ టి. ఉషా విశ్వనాథ్, అడ్మిన్ ఎస్‌ఐ రాజు, షీ టీమ్స్‌ సిబ్బంది, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.


Similar News