ఆ అంశంపై ప్రధాని మాట్లాడాలని.. రాజ్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్

టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండి రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

Update: 2023-03-15 08:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో :

టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండి రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అదానీ హిండెన్‌బర్గ్ అంశం, ఆదాని షేర్ల పతనం, పార్లమెంటరీ కమిటీ వేయాలని, క్రోనీ క్యాపిటలిస్టుల వంటి పలు అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజభవన్‌కు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం ఛలో రాజ్‌భవన్‌(ముట్టడికి)కు పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నేతలు బయలుదేరారు.

ఈ క్రమంలో ఖైరతాబాద్‌ సర్కిల్ వద్దకు చేరుకున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, సర్కిల్ వద్ద కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసనకు దిగారు. రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్కను అరెస్టు చేసిన పోలీసులు, వారిని గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అటు రాజ్‌భవన్‌ వద్ద మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యను అరెస్ట్ చేసి పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు.

అరెస్టైన వారిలో ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశం ప్రమాదంలో పడిందన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేసిందని, కానీ మోడీ వచ్చాక ఒక్కరిద్దరికే కట్టబెడుతున్నారని మండిపడ్డారు. హిండెన్ బర్గ్‌ నివేదిక ప్రపంచాన్ని షేక్ చేసిందని, దేశం నుంచి మోడీని వదిలించుకోవాలన్నారు. అదానీ అంశంపై మోడీ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.

క్రోనీ క్యాపిటలిస్టులకు మోడీ దోచిపెడుతున్న దేశ సంపద ప్రజలకు చెందాలని కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ పాలకులను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని భట్టి హెచ్చరించారు. తమ పోరాటం ప్రజల కోసం, ఈ దేశం సంపద రక్షణ కోసమని స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి తమ నిరసన తెలపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కాంగ్రెస్ నేతలను మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. పోలీసులు అడ్డుకున్నా ఛలో రాజ్‌భవన్‌కు వెళతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ ఛలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాజ్‌భవన్ వైపు వెళ్లే రోడ్లను మూసివేశారు. ఖైరతాబాద్ సిగ్నల్స్ నుండి రాజ్‌భవన్ రూట్ బంద్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. 

Tags:    

Similar News