‘పల్లె పల్లెకూ ‘తెలంగాణ మోడల్’.. ఔరంగబాద్ సభే లక్ష్యం’
పల్లెపల్లెకూ తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పథకాలను వివరించే 7 వీడియో స్క్రీన్ ప్రచార రథాలను మహారాష్ట్రలోని ఔరంగబాద్ పట్టణంలో సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పల్లెపల్లెకూ తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పథకాలను వివరించే 7 వీడియో స్క్రీన్ ప్రచార రథాలను మహారాష్ట్రలోని ఔరంగబాద్ పట్టణంలో సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఔరంగబాద్ జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలోని ప్రతి పల్లెలో తెలంగాణలోని 450 స్కీముల విశిష్టత గురించి ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ పాలన తెలంగాణ రైతులకు స్వర్ణయుగమన్నారు. తొమ్మిది విడతలలో రైతుబంధు పథకం కింద 62 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.80వేల కోట్లు జమచేశామన్నారు.
ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్నామని, రైతుబీమా, మిషన్ కాకతీయ, రైతువేదికల నిర్మాణం, రుణమాఫీ, విత్తనాల రాయితీ, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించనున్నట్లు వెల్లడించారు. బీజేపీ,కాంగ్రెస్‌లవి ఓట్లు, సీట్ల రాజకీయాలు తప్ప ప్రజల బాగోగులు ఆ పార్టీలకు పట్టవని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ది అభివృద్ధి, సంక్షేమ విజన్‌గా అభివర్ణించారు. ఈనెల 24న జరగనున్న ఔరంగబాద్ సభకు పల్లెలన్నీ కదిలి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాల చారి, బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న ఢోంగే, నాయకులు అంకిత్, శివాంక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.