తెలంగాణ మొత్తం తాగుతూ ఊగుతోంది.. ప్రొఫెసర్ కాశీం
తెలంగాణ రాష్ట్రంలో నేటితరం యువత మద్యం మత్తులో తూలుతోందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం ఆందోళన వ్యక్తం చేశారు.
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో నేటితరం యువత మద్యం మత్తులో తూలుతోందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు నెలకొల్పిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ అధికార ప్రతినిధి మాజీ ఎంపి మంద జగన్నాథం తో పాటు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదహారేళ్ళ వయసులో ఉండే యువత నుండి 50 ఏళ్లు వృద్ధుల దాకా నిత్యం తాగి తూలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .
దాని ఫలితంగానే రోడ్డు ప్రమాదాలు హత్యలు అత్యాచారాలు విడాకులు తల్లిదండ్రులను హింసించడం జరుగుతున్నాయన్నారు. మండలానికి మద్యం షాపు గ్రామాల్లో గల్లి గల్లి బెల్ట్ షాపు ఏర్పాటు చేయడంతో నిరుపేదలు అనారోగ్య పాలవుతున్నారని చివరికి అగ్రకులస్తుల ఆసుపత్రులకే పరుగులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు నిరుపేదల పెళ్ళాం బిడ్డల పుస్తెలతాడు భూములను అమ్ముకొని ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెడుతున్నారని విచారణ వ్యక్తం చేశారు. దీనికంతటికీ కారణం స్థానిక ప్రజా ప్రతినిధులు కరా అని ప్రశ్నించారు. 90 ఏళ్ల కాలంలో దళితులు పడ్డ కష్టాన్ని సరిచూసి ఎన్నో పోరాటాలు చేసి బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమానత్వాన్ని తీసుకొచ్చారని చివరికి నేటి పాలకుల ఉచ్చులపడి మద్యానికి బానిసై ఓటును అమ్ముకొని మళ్ళీ బానిసలుగానే కొనసాగే పరిస్థితిని తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చేందుకు ఎందరో జుమికీలు చేస్తున్నారని దాని గుర్తించి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజాస్వామ్యం మొత్తం ఖూనీ అయిందని ఏదైనా సందర్భంలో నిర్వహించే సభలపై ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు సభను అవమానించడం పరిపాటిగా మార్చుకున్నారని మండిపడ్డారు. అలాంటి ప్రజాప్రతినిధులు హాజరయ్యే సభలకు తమను పిలవద్దని కూడా రిక్వెస్ట్ చేశారు.
మహానుభావుల విగ్రహాలు నెలకొల్పినంత మాత్రాన వారి ఆశయాలు కొనసాగించినట్లు కాదన్నారు. నేటి తరానికి సందేశం ఇవ్వడం ద్వారానే ప్రేరణపొంది వారి ఆశయాల సాధనకోసం సన్మార్గంలో నడిచే అవకాశం ఉంటుందన్నారు. కానీ ఫోటోలు దిగి దండలు వేసి వెళ్లిపోతే ఈ విగ్రహాలు ఎందుకో చెప్పాలన్నారు. గతంలో ఏదైనా వేదిక ఏర్పాటు చేస్తే వేదికకు మర్యాద ఇస్తూ చివరి ప్రసంగం వరకు ఉండేవారని ప్రస్తుతం రాష్ట్రంలో ఓ నిరంకుశత్వం నడుస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సభ నియమావలికి వ్యతిరేకంగా ముందు వెళ్తానంటూ ప్రసంగించడంతో ప్రొఫెసర్ కాసిం పై విధంగా స్పందించారు.