చంద్రబాబును గుర్తు చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చిన నిర్మాత బండ్ల గణేష్
సైబర్ టవర్స్ నిర్మించి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సాఫ్ట్‌వేర్
దిశ, వెబ్‌డెస్క్: సైబర్ టవర్స్ నిర్మించి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకి కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత బండ్ల గణేష్, నందమూరి కుటుంబసభ్యులతో పాటు ఐటీ ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని గుర్తు చేస్తూ బండ్ల గణేష్ వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రసంగం మధ్యలో చంద్రబాబు అరెస్ట్‌ను గుర్తు చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. యువతకు భవిష్యత్ ఇచ్చినందుకు చంద్రబాబును జైల్లో పెట్టారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం చచ్చిపోతానని, తన ఆయుష్షును చంద్రబాబుకు ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. చంద్రబాబు దేవుడు అని, తెలుగువాడిగా పుట్టడం నేరమా? అని ప్రశ్నించారు. తమిళనాడులో చంద్రబాబు పుట్టింటుంటే ఇలా జరిగేదా? అని బండ్ల గణేష్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు కాదని, ఒక బ్రాండ్ అని బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నిజాయితీపరుడని, ఆయన ఏ తప్పు చేయరని అన్నారు. ఇటీవల తాను రెండుసార్లు లోకేశ్‌ని కలిశానని బండ్ల గణేష్ పేర్కొన్నాడు.