ఆర్టీసీ బస్సు సిత్రాలు! ఏకంగా బస్సు వెనకాలే..?
తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు మేడారానికి వెళ్లాయి. దీంతో ఇతర జిల్లాల ప్రయాణికులు బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో ఇంకా రద్దీ పెరిగింది. దీంతో బస్టాప్‌ల వద్ద ప్రయాణికులు వేచి చూడాల్సి వస్తుంది.. మరోవైపు వచ్చిన బస్సుల్లో కిక్కిరిసి పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు.
సిటీ బస్సుల్లో కొన్ని చోట్ల అయితే ఆడ, మగ తేడా లేకుండా ప్రమాదకరంగా ఫుట్ బోర్డుకు వేలాడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ఆకతాయి ఎక్స్‌ప్రెస్ బస్సు వెనుక వెలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించినట్లు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.