కేసీఆర్ కన్నేసిన రాష్ట్రంపై మోడీ ఫోకస్.. పవర్‌లోకి వచ్చేందుకు భారీ స్కెచ్!

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం ఆసక్తిని రేపుతోంది.

Update: 2023-03-22 08:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం ఆసక్తిని రేపుతోంది. గతంలో కంటే ఈ సారి అధిక స్థానాల్లో గెలిచి ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు ఆ దిశగా వేగంగా పావులు కదపడం చర్చగా మారింది. ఇప్పటికే సౌత్ ఇండియాపై ఫోకస్ పెట్టిన కమలనాథులు త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటక ఎలక్షన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పార్టీ పెద్దలు అనుసరిస్తున్న వ్యూహం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా మరోసారి ప్రధాని మోడీ కర్ణాటకలో పర్యటించబోతున్నారు. మార్చి 25న ఆయన చిక్కబళ్లాపూర్, బెంగళూరు, దావణగెరెలలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దావణగెరెలో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగించస్తారు.

ఏడో సారి మోడీ

ఆపరేషన్ సౌత్ విషయంలో కమలనాథులు సీరియస్‌గా పని చేసుకుంటూ వెళ్తున్నారనే టాక్ చాలా కాలంగా పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా తరచూ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. అయితే నిత్యం బిజీ షెడ్యూల్‌లో ఉండే ప్రధాని సైతం వరుసగా కర్ణాటకను చుట్టిరావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మోడీ కర్ణాటకలో ఆరు సార్లు పర్యటించగా ఎల్లుండి ఏడోసారి కర్ణాటకకు రాబోతున్నారు. నిజానికి కర్ణాటకలో అధికారంలో ఉన్నది బీజేపీనే అయినా ఆ పార్టీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడం ప్రతిపక్షాలకు సవాల్‌గా మారింది.

గుజరాత్ సీన్ కర్ణాటకలో రిపీట్

గతేడాది గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే వైఖరి అవలంభించింది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా తమదైన శైలిలో తిప్పికొడుతూ ప్రధాని వరుసగా ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు ఆమ్ ఆద్మీ పార్టీ కమలనాథులకు సవాల్ విసిరినా అవేవి మోడీ హవా ముందు పని చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ పాలన కాదు తనను చూసి ఓట్లు వేయాలంటూ ప్రధాని స్వయంగా చేసిన ప్రకటన పట్ల అక్కడి ఓటర్లు విశ్వాసం ఉంచారనేది ఫలితాలను బట్టి చూస్తే అర్థం అవుతోంది.

కర్ణాటకలోనూ ఇటీవల అమిత్ షా ఇదే మాటను చెప్పారు. విపక్షాల మాటలను నమ్మొద్దని ప్రధాని మోడీ, యడ్యూరప్పను చూసి బీజేపీకి మద్దతుగా నిలవాలని ఓటర్లను అభ్యర్థించారు. దీంతో తమ జాతీయ నేతల వ్యూహం పక్కగా ఉందని ఈ సారి కూడా అధికారం తమదేననే ధీమా కర్ణాటక కమలనాథులలో కనిపిస్తోంది. అయితే బీజేపీ పప్పులు కర్ణాటకలో ఉడకవని ఈ సారి ఇక్కడ మోడీ, అమిత్ షాకు భంగపాటు తప్పదని కాంగ్రెస్, జేడీఎస్ ఎటాక్ చేస్తోంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సైతం ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోడీ వరుస టూర్లు కర్ణాటకలో బీజేపీని ఏ మేరకు విజయం వైపు నడిపిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News