ఈ నెల 30 న తెలంగాణకు ప్రధాని?

రాష్ట్రంలో ప్రధాని మోడీ బహిరంగసభకు బీజేపీ స్టేట్ యూనిట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.

Update: 2023-06-07 04:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రధాని మోడీ బహిరంగసభకు బీజేపీ స్టేట్ యూనిట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. మల్కాజిగిరిలో ఈ నెల 30న భారీ బహిరంగసభ నిర్వహించాలని భావిస్తున్నది. దానికి మోడీని ఆహ్వానించేలా ప్రధాని కార్యాలయానికి రాష్ట్ర కమిటీ తరఫున రిక్వెస్ట్ వెళ్లింది. దీనిపై ఢిల్లీలోని పీఎంఓ అధికారులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఇదిలా ఉండగా రాష్ట్ర కమిటీలో కొన్ని మార్పులు చేర్పుల దిశగా ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర స్థాయి నేతల్లో కొద్దిమందికి కీలక బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రచార కమిటీ, ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ లాంటివి కొత్తగా తెరపైకి రానున్నాయి.

మరోవైపు ఈ మార్పులు చేర్పుల గురించి చర్చించడానికి రాష్ట్ర యూనిట్ నేతలను ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. ఈ నెల 10వ తేదీ లోపు చర్చలు పూర్తి చేసి అవసరమైన బాధ్యతలను అప్పజెప్పే అవకాశమున్నది. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత రాష్ట్రంలోని బీజేపీ లీడర్లలో, కేడర్‌లో తీవ్ర స్థాయిలో నిరాశా నిస్పృహలు నెలకొన్న నేపథ్యంలో వారిలో జోష్ నింపాలని పార్టీ భావిస్తున్నది. పార్టీలోని నేతలకు మాత్రమే కాక శ్రేణుల్లో, ప్రజల్లో ఉత్సాహం తగ్గిందని కేంద్ర నాయకత్వం గ్రహించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ ఇంతకాలం గంభీరంగా ప్రకటనలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నాలుగు పార్లమెంటు స్థానాలు, మూడు అసెంబ్లీ స్థానాలు కూడా ప్రశ్నార్థకంగా మారకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో యాక్టివిటీస్‌ను ముమ్మరం చేయాలని భావిస్తున్నది.

పార్లమెంటు సెగ్మెంట్లలో సభలు

రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టింది. పార్లమెంటు ప్రవాస్ యోజన పేరుతో గతంలో కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించగా ఇప్పుడు జన సంపర్క్ అభియాన్ పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు గత కొన్ని రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అర్జున్‌రామ్ మేఘవాల్, ప్రహ్లాద్ జోషి, మన్‌సుఖ్ మాండవీయ తదితరులు పలు జిల్లాల్లో పర్యటించి వెళ్లారు. దీనికి కొనసాగింపుగా కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 15న ఖమ్మం పట్టణంలో బహిరంగసభకు హాజరవుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 25న నాగర్‌కర్నూల్ పట్టణంలో బహిరంగసభలో పాల్గొననున్నారు.

తొమ్మిదేళ్ల మోడీ పాలనను ప్రజలకు వివరించేందుకుగాను రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో ఇలాంటి భారీ బహిరంగసభలను నిర్వహించాలని షెడ్యూలు రూపొందించుకున్నది. గత నెలలో అమిత్ షా చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌లో బహిరంగసభకు హాజరయ్యారు. ఈసారి ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఈ నెల 15న జరిగే సభకు హాజరవుతున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్‌లో మోడీతో భారీ స్థాయిలో బహిరంగసభకు స్టేట్ యూనిట్ ప్లాన్ చేస్తున్నది. ఇప్పటివరకు జరిగిన బహిరంగసభలన్నీ బీజేపీయేతర ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నవే. రాబోయే మూడు నెలల్లో అన్ని పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా నెలకు రెండు లేదా మూడు చొప్పున పబ్లిక్ మీటింగులను నిర్వహించేలా స్టేట్ యూనిట్ ప్లాన్ చేస్తున్నది.

స్టేట్ యూనిట్‌లో మార్పులపై త్వరలో క్లారిటీ

రాష్ట్ర నాయకత్వంలో పలు మార్పులు ఉండొచ్చని రెండు మూడు రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. స్టేట్ చీఫ్ మార్పుపై గతంలో ఇలాంటి ఆరోపణలే రావడంతో అలాంటి మార్పులేవీ ఉండవని పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మొదలు ఈటల రాజేందర్ వరకు పలుమార్లు స్పష్టత ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రచార కమిటీ, సమన్వయ కమిటీ లాంటి కొన్ని కొత్త వ్యవస్థలు ఉనికిలోకి రానున్నాయి. ఇప్పటికే పార్టీ తరఫున పలు పదవులు, బాధ్యతలు ఉన్నప్పటికీ ప్రజల్లోకి వెళ్లేలా మార్పులు చేర్పులు జరిగే అవకాశమున్నది. ఈటల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ లాంటి పలువురి పేర్లు ఢిల్లీ స్థాయి నేతల పరిశీలనలో ఉన్నాయి.

నేషనల్ కౌన్సిల్ మెంబర్లు సహా పలువురు రాష్ట్ర నేతలకు, సీనియర్లకు ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లడంతో అమిత్ షా ఈ నెల 15న ఖమ్మంలో సభకు హాజరయ్యే లోపే ప్రకటనలు వెలువడే అవకాశమున్నది. స్టేట్ బాడీతో చర్చించిన తర్వాత లాంఛనంగా కేంద్ర పార్టీ ఆఫీసు ప్రకటన చేయనున్నది. పార్టీ స్టేట్ చీఫ్ మార్పు ఉండకపోవచ్చంటూ రాష్ట్ర నేతలే నొక్కి చెప్తున్నారు. అయినా బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఎన్నికల ముందు అలాంటి ప్రయోగాలు ఉండవనే మాటలు మరికొద్దిమంది రాష్ట్ర నేతల నుంచి వినిపిస్తున్నాయి. నాలుగైదు రోజుల్లోనే ఈ మార్పులు చేర్పులపై సెంట్రల్ ఆఫీస్ నుంచి లాంఛనమైన ప్రకటన విడుదల కానున్నది.

Tags:    

Similar News