ఒకటే బ్రాండ్.. భారత్ బ్రాండ్: ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
Prime Minister Modi made important remarks in the Ramagundam Sabha
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ప్రధాని మోడీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోడీ.. ''రామగుండం గడ్డమీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నమస్కరిస్తున్నా.. ఈ సభకు వచ్చిన రైతులకు ధన్యవాదాలు'' అని తెలుగులో ప్రసంగించి ప్రధాని ఆకట్టుకున్నారు. ప్రధాని తెలుగులో మాట్లాడటంతో సభకు వచ్చిన వారంతా కేకలతో హోరెత్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. యావత్ ప్రపంచం రెండున్నర్లేళ్లుగా కరోనాతో పోరాడుతోందని.. విపత్కర పరిస్థితుల్లో సైతం భారత్ ఆర్థికంగా పరుగులు పెట్టడంతో పాటు.. అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని మోడీ వ్యాఖ్యానించారు. గత ఎనిమిదేళ్లలో భారత్ రూపురేఖలు మారిపోయాయన్నారు. ప్రభుత్వ పాలనలో, వ్యవస్థ తీరులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని.. నయా భారత్ మన కళ్ల ముందు కనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీతో యూరియా బ్లాక్ మార్కెట్‌ను కూడా అరికట్టామని.. ఇక నుంచి ఒకటే యూరియా.. భారత్ యూరియా.. భారత్ బ్రాండ్ అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం శంఖుస్థాపనలకే పరిమితం కాలేదని.. పనులు సైతం వేగంగా పూర్తి చేస్తుందని తెలిపారు.