ఈనెల 26న తెలంగాణకు President Murmu
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 26న తెలంగాణకు రానున్నారు.
దిశ, వెబ్ డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 26న తెలంగాణకు రానున్నారు. శీతకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ఈనెల 26 నుంచి 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. 26న మధ్యాహ్నం శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకుని అక్కడినుంచి తెలంగాణ పర్యటనకు రానున్నారు. 26న మధ్యాహ్నం 3.05 గంటల నుంచి 3.15 వరకు బొల్లారంలో యుద్ధ స్మారకానికి నివాళులు అర్పిస్తారు. వీరనారులకు సన్మానం చేయనున్నారు. సాయంత్రం 7.45 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇచ్చే విందులో పాల్గొంటారు.
27న ఉదయం 10.30 గంటలకు నారాయణ గూడలోని కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీని సందర్శించి విద్యార్థులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు సర్ధార్ వల్లభాయ్ జాతీయ పోలీస్ అకాడమీని సందర్శంచి ట్రైనీ ఐపీఎస్ లతో మాట్లాడతారు. ఈనెల 28న ఉదయం 10.40 నుంచి 11.10 గంటల వరకు భద్రాచలం ఆలయాన్ని సందర్శిస్తారు. కేంద్ర పర్యాటక శాఖ కి సంబంధించిన ప్రశాద్ అనే ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. 29న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు షేక్ పేట్ లోని నారాయణమ్మ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటిస్తారు.
సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శంషాబాద్ లోని శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శిస్తారు. 30న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు రంగారెడ్డి జిల్లా శాంతివనంలోని శ్రీరామచంద్ర మిషన్ ను సందర్శించి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏపీ, తెలంగాణకు చెందిన అంగన్ వాడీ, ఆశావర్కర్లను ఉద్దేశించి మాట్లాడతారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హర్ దిల్ ధ్యాన్.. హర్ దిన్ ధ్యాన్ అనే నినాదాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీరామచంద్ర మహారాజ్ 105వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్రపతి నిలయంలో భోజనం చేసి ఢిల్లీ బయలు దేరి వెళ్తారు.
Also Read...
సుప్రీంకోర్టులో సరిహద్దు వివాదం.. శ్రుతిమించొద్దని అంగీకరించిన కర్ణాటక, మహారాష్ట్ర