బ్రేకింగ్: ప్రవళిక సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్.. కోర్టులో శివరామ్‌కు బిగ్ రిలీఫ్..!
ఇటీవల హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శివరామ్ రాథోడ్ అనే యువకుడి వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అతడిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శివరామ్ ఇవాళ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో శివరామ్‌పై పోలీసులు మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు లేకపోవడంతో అతడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించేందుకు కోర్టు నిరాకరించింది.
కేసు దర్యాప్తు జరగుతున్నందున రిమాండ్ చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేవలం చాటింగ్ ఆధారాలతో ఎలా రిమాండ్ చేస్తారని ప్రశ్నించింది. శివరామ్‌ను అరెస్ట్ చేయొద్దని కోర్టు పోలీసులకు సూచన చేసింది. ఇక, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు తెలియజేస్తానని శివరామ్ తరుఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.
కాగా, ఈ కేసులో పోలీసులు నిందితునిగా పేర్కొన్న శివరామ్ రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. తన కొడుకును ఈ కేసులో అన్యాయంగా ఇరికించారంటూ శివరామ్ రాథోడ్ తండ్రి నేనావత్ కిషన్ రాథోడ్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన 24గంటలలోపే ఈ పరిణామం జరగటం గమనార్హం. ఈ నెల 13న ప్రవళిక అశోక్ నగర్లోని బృందావన్ హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటం వల్లనే ఆమె ప్రాణాలు తీసుకుందని పెద్ద సంఖ్యలో విద్యార్థులు అదే రోజు రాత్రి ఆందోళన జరిపారు.
అయితే, ఆ మరుసటి రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రేమ వ్యవహారం ప్రవళిక ఆత్మహత్యకు కారణమని చెప్పారు. శివరామ్ రాథోడ్ మోసం చెయ్యటం వల్లనే ఆమె ప్రాణాలు తీసుకుందని చెప్పారు. ఈ క్రమంలో శివరామ్ రాథోడ్ పై ఐపీసీ 420, 417, 306 సెక్షన్ల ప్రకారం చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. శివరామ్ రాథోడ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో శివరామ్ రాథోడ్ శుక్రవారం నాంపల్లిలోని 9వ మెట్రోపాలిటన్ కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి కోర్టు ఒప్పుకోవటంతో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. ఈ క్రమంలో శివరామ్‌ను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించేందుకు న్యాయస్థానం నిరాకరించడంతో ఈ కేసుపై ఉత్కంఠ నెలకొంది.