KCR ప్లాన్-బీ.. ఆసక్తి రేపుతోన్న Prashant Kishor (ప్రశాంత్ కిషోర్) కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై స్పీడ్ పెంచారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమ
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై స్పీడ్ పెంచారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమయంలో బీజేపీ, కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయ ఎజెండాపై కామెంట్స్ చేసిన కేసీఆర్.. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యారు. తాజాగా మరోసారి ఆయన జాతీయ స్థాయి అంశాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. బీజేపీ చేసిందేమీ లేదని నిప్పులు కక్కుతున్నారు. అయితే కేసీఆర్ బిహార్ టూర్ తో మరోసారి బీఆర్ఎస్ పై చర్చ మొదలైంది. కేసీఆర్ పర్యటనకు కొనసాగింపుగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. దసరా నాటికి బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం మరోసారి తెరపైకి వస్తున్న వేళ.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ బీహార్ లో సెన్సేషనల్ గా మారాయి.
ఆసక్తి రేపుతున్న ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ బిహార్ పర్యటన అనంతరం పీకే చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. సాధారణంగా అయితే పీకే బిహార్ లో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణలో ఇంతలా ప్రాముఖ్యత ఉండకపోయేది. కానీ పీకే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. అందులో కేసీఆర్ బిహార్ సీఎంతో భేటీ అయ్యాక ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. ప్రస్తుతం జన్ సూరజ్ అభియాన్ పేరుతో ప్రజలను కలుస్తున్న ప్రశాంత్ కిశోర్.. గురువారం హాజీపూర్ చేరుకున్నారు. అక్కడ ఆయన జన్ సూరజ్ సానుభూతిపరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బిహార్ రాజకీయాలు గడిచిన మూడు నెలల్లో 180 డిగ్రీలు మలుపు తిరిగాయని చెప్పుకొచ్చారు. అలాగే వెనుక ఏం జరుగుతుందో ఎవరికి తెలియదన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో భవిష్యత్ లో చూడాలన్నారు. 2025లో బీహార్ రాజకీయం జన్ సూరజ్ వైపు మళ్ళుతుందని వ్యాఖ్యానించారు. అలాగే జన్ సూరజ్ తరపున ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా.. వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని ప్రశాంత్ కిషోర్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, భవిష్యత్ లో భావ సారూప్యత కలిగిన వారితో పార్టీ ఏర్పాటు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే ఈ పార్టీకి అధ్యక్షుడు మాత్రం ప్రశాంత్ కిశోర్ ఉండరని మరోసారి స్పష్టం చేశారు. పీకే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీహార్ రాజకీయంలో దుమారం రేపుతోంది. కేసీఆర్ మిత్రుడిగా ఉన్న పీకే.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పడం వెనుక వ్యూహం ఏంటి? అనేది నితీష్ కుమార్ వర్గంలో చర్చ జరుగుతోందట.
కేసీఆర్ ప్లాన్-బీలో భాగమా?
జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలతో భేటీ అయి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బీజేపీతో ఫ్రెండ్‌షిప్ కటీఫ్ చేసుకున్న నితీష్ తో కలిసి వేదికను పంచుకున్నారు. ఇదిలా ఉంటే అవకాశం ఉన్న ప్రతిసారి నితీష్ పై పీకే ఏదో రకంగా సెటైర్లు వేస్తున్నారు. ఎన్డీయే నుండి వైదొలిగిన నితీష్ కుమార్ పై మొన్నటికి మొన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. నితీష్ సీఎం పదవి కోసం ఫెవికల్ ఉపయోగిస్తున్నారని, ప్రతిపక్షాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయని కామెంట్ చేశారు. నితీష్ పై తన మిత్రుడు పీకే విమర్శలు గుప్పిస్తుంటే.. కేసీఆర్ మాత్రం అదే నితీష్ కుమార్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఎలా అర్థం చేసుకోవాలనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పీకే బిహార్ లో పోటీ చేసేందుకు అభ్యర్థులకు సహాకారం అందిస్తానంటుంటే.. కేసీఆర్ మాత్రం నితీష్ కుమార్ తో కలిసి బీజేపీని ఢీ కొంటానని చెప్పడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జాతీయ రాజకీయాల్లో భాగంగా సీఎం కేసీఆరే ప్రశాంత్ కిశోర్ చేత జన్ సూరజ్ ఎత్తుగడ వేశారని, ఇదంతా కేసీఆర్ ప్లాన్-బి లో భాగమని మరి కొంతమంది వాదిస్తున్నారు. అందువల్లే తాము పెట్టబోయే పార్టీకి తాను అధ్యక్షుడిని కాదని పీకే పదే పదే చెప్పడం వెనుక బీఆర్ఎస్ పార్టీనే అసలు కారణం అనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇలాంటి ఊహాగానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో త్వరలో బీహార్ రాజకీయాలు మలుపు తిరుగుతాయని, బీహార్ రాజకీయంలో మరికొన్ని ప్రకంపనలు వస్తాయని పీకే చెప్పడం వెనుక ఏం జరగనుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.