ప్రణీత్ రావు మరో నిర్వాకం.. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు దశాబ్ధాల మావోయిస్టుల నిఘా డేటా ధ్వంసం!

రాజకీయ, సినీ, వ్యాపార రంగాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజురోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది

Update: 2024-04-08 13:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయ, సినీ, వ్యాపార రంగాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజురోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది. ట్యాపింగ్ ముసుగులో ప్రణీత్ రావు గ్యాంగ్ అనేక అరాచకాలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించగా గతంలో ఎస్ఐబీ సేకరించిన డేటా మొత్తాన్ని గ్యాంగ్ ధ్వంసం చేసినట్లు తాజాగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి వాటిని మూసీనదిలో పారేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పనితో ఫోన్ ట్యాపింగ్ సమాచారంతోపాటు విలువైన నిఘా సమాచారం ధ్వంసం అయిందని, మావోయిస్టులు, కరుడుగట్టిన నేరగాళ్లకు సంబంధించి వారి కదలికల డేటా అంతా తుడిచిపెట్టుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావు గ్యాంగ్ చేసిన పనికి పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చర్చ జరుగుతోంది.

తెరపైకి కన్వర్జెన్స్ ల్యాబ్..

ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సమకూర్చిన టూల్ వాడారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ వద్ద కూడా హార్డ్ డిస్క్‌లలో నిక్షిప్తం చేసిన డేటా లేదని సమాచారం. ఈ ల్యాబ్‌కు పాల్ రవికుమార్, బూసి, శ్రీవల్లి గొడి డైరెక్టర్లుగా ఉన్నారు. రవికుమార్, శ్రీవల్లి మరో 6 కంపెనీలకు సీఈవోలుగా ఉన్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. దీంతో డేటా డిలీట్ చేయడంలో రవికుమార్, శ్రీవల్లి వ్యవహారంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎస్ఐబీ సేకరించిన కీలక డేటా రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమవుతూనే మరోవైపు కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ మాటున ప్రణీత్ రావు ఏం చేశారనే దానిపై దర్యాప్తు అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవికుమార్, శ్రీవల్లితో పాటు మరికొంతమందిని పోలీసులను త్వరలో విచారించబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News