పెట్టుబడి దారులకు మోడీ కొమ్ము కాస్తున్నారు : ప్రకాష్ కారత్

పెట్టుబడి దారులకు మోడీ కొమ్ము కాస్తున్నారని సీపీఐఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ అన్నాడు.

Update: 2023-03-29 09:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పెట్టుబడి దారులకు మోడీ కొమ్ము కాస్తున్నారని సీపీఐఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ అన్నాడు. సీపీఐఎం జనచైతన్య యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ ఎస్ ఎస్ కూటమి, కార్పొరేట్ ల కూటమి తొమ్మిదేళ్లలో దేశాన్ని దోచుకున్నారు. విద్య, వైద్యం, నిరుద్యోగం, ధరల పెరుగుదలలో కేంద్రంలోని బీజేపీ విఫలమయిందన్నారు. నలభై యాభై ఏళ్ల కింద ఒక సామెత ఉండేది. టాటా బిర్లా‌లకు కొమ్ము కాసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేసేవారని.. ప్రస్తుతం అదానీ, అంబానీ సర్కార్‌ నీ కుల్చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మోడీ ప్రధాని అయ్యాకా అదానీ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా బీజేపీ తొమ్మిది ఏళ్లలో నెరవేర్చలేదన్నారు. బీజేపీది అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. కొన్ని హామీలను కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేక పోయిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పెకిలించాలని బీజేపీ చూస్తోందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం మన దేశానికి పనికి రాదని బీజేపీ వాళ్లు చెబుతున్నారని.. మను ధర్మ శాస్త్రం అమలు చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

చాతుర్వర్ణ వ్యవస్థను కమలం పార్టీ అమలు చేయాలని చూస్తుందన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల జన చైతన్య యాత్రలు నిర్వహించడం అంటే ఆషామాషీ కాదన్నారు. వామపక్ష పార్టీలు బలహీన పడ్డాయి అంటే బలహీన వర్గాలు బలహీనపడినట్లేనన్నారు. ప్రగతి శీల పథకాలు తేవడంలో కీలక పాత్ర కమ్యూనిస్టులదే అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో బీజేపీకి కేసీఆర్ మద్దతు ఇచ్చినా అనేక పోరాటాలు చేశామన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ సాధించడంలో ఎర్రజెండా ప్రధాన పాత్ర పోషించిందన్నారు.

Tags:    

Similar News