Ponnam Prabhakar: సర్పంచులకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్

సర్పంచులకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2024-11-04 11:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తాజా మాజీ సర్పంచులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చిలోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. సోమవారం గాంధీ భవన్  (Gandhi Bhavan) లో మీడియాతో మాట్లాడిన ఆయన పెండింగ్ బిల్లులు (Sarpanches Pending Bills) చెల్లించాలని మాజీ సర్పంచుల ఆందోళనపై స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. సర్పంచులు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపమే నేడు సర్పంచుల ఆందోళన అని, సర్పంచుల ఆత్మహత్యలకు కారణం అయిన వారనే నేడు మద్దతుగా ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరి బీఆర్ఎస్ (BRS) నేతలు రాష్ట్రంలో సర్పంచుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీల ఉచ్చులో సర్పంచులు పడొద్దన్నారు.

కిషన్ రెడ్డి రక్తంలో తెలంగాణ డీఎన్ఏ లేదు:

కేసీఆర్ (KCR) సలహాతోనే కిషన్ రెడ్డి (kishan Reddy) బీజేపీ అధ్యక్షుడు అయ్యారని కిషన్ రెడ్డి విమర్శలు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిందేంటో కిషన్ రెడ్డి, బండి సంజయ్ (Bandi Sanjay) చెప్పాలన్నారు. అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు రావాలన్నారు. కిషన్ రెడ్డి రక్తంలో తెలంగాణ డీఎన్ఏ లేదని, తెలంగాణ డీఎన్ ఏ ఉంటే ఈ రాష్ట్రం కోసం ఏదైనా చేసేవారన్నారు. వరద నష్టం నివేదికను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు నివేదిక ఇస్తే పది వేల కోట్ల నష్టానికి కేవలం రూ.400 వందల కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నదని ఈ రెచ్చగొట్టే కార్యక్రమం ముగిశాక న్యాయం చేయడానికి మేము వెళతామన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ అయితే శవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు.

Tags:    

Similar News