మునుగోడులో పొలిటికల్ దీపావళి.. మహిళలకు ప్రత్యేక గిఫ్ట్‌లు!
రాష్ట్రమంతా దీపావళి పండుగ వాతావరణాన్ని సంతరించుకున్న తరుణంలో మునుగోడులో మాత్రం పొలిటికల్ దీపావళి జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉన్న రాజకీయ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రమంతా దీపావళి పండుగ వాతావరణాన్ని సంతరించుకున్న తరుణంలో మునుగోడులో మాత్రం పొలిటికల్ దీపావళి జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ.. దీపావళి సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరికీ టపాసులు, మిఠాయిలతో పాటు మహిళలకు ప్రత్యేక గిఫ్ట్‌లు ఇచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకోసం ఆయా పార్టీల అభ్యర్థుల పర్సనల్ వ్యక్తులు టపాసులు, మిఠాయిల గిఫ్ట్ ప్యాకింగ్‌లు తయారు చేయించేందుకు ఆయా వ్యాపారస్థులతో చర్చలు సాగిస్తున్నారు. ఒక్కో ప్యాకింగ్ రూ.5 వేలకు తగ్గకుండా టపాసులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు స్వీట్ ప్యాకెట్లు కూడా పంచనున్నారు. ఇదిలా ఉంటే మహిళలు, యూత్ ఓట్లను ఆకర్షించేందుకు కూడా ప్రత్యేకంగా కొన్ని ప్యాకేజీలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే యూత్ ఓటర్లలో పలుకుబడి ఉన్నవారికి ఉప ఎన్నిక మంచి క్రేజ్ తెచ్చిందన్న చర్చ జోరుగా నడుస్తుండడం గమనార్హం.
ప్రతి రోజూ పండుగే..
మునుగోడు ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ ఓటర్లందరి పరిస్థితి ప్రతి రోజూ పండుగే అన్న చందంగా తయారైంది. ఇప్పటికే నియోజకవర్గంలో పలుకుబడి ఉన్న నేతలు, సర్పంచ్, ఎంపిటీసీ, జెడ్పీటీసీలు తదితర ప్రజాప్రతినిధులకు రాజకీయ పార్టీలు కార్లను బహుమతులుగా ఇచ్చాయి. కాగా మరోవైపు నిత్యం నేతల పేర్లు ప్రజల మధ్యన మెలగాలన్న తపనతో మద్యం, మాంసాన్ని సైతం పంచుతున్నారు. ప్రస్తుతం ఇవి నిత్యకృత్యంగా మారగా దీపావళి సందర్భంగా మద్యం, మాంసం మరింత సేల్ జరగనుంది. కాగా దీవాళి స్పెషల్ గిఫ్ట్ లు కూడా మునుగోడు ఓటర్లు అందుకోనున్నారు.
ఓటరు తీర్పుపై పార్టీల నిట్టూర్పులు..
దేశంలోనే ఎక్కడా లేని విధంగా మునుగోడు ఉప ఎన్నికలో ఆయా రాజకీయ పార్టీలు యథేచ్చగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ప్రతి రోజూ పోలింగ్ రోజే అన్న విధంగా పార్టీలు ఓటర్లకు తాయిలాలను ఇస్తున్నాయి. అయితే ఇంతవరకూ భాగానే ఉన్నా పార్టీల నేతల్లో మాత్రం ఓటరు తీర్పుపై గుబులు పట్టుకుంది. ఏ ఉప ఎన్నికలో చేయని విధంగా కార్లు, బహుమతులు ఇవ్వడంతో పాటు దీపావళి సందర్భంగా టపాసులు, మిఠాయిలు, మహిళలకు ప్రత్యేక బహుమతులు ఇచ్చేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. కానీ చివరికి ఓటరు తీర్పు ఎటువైపు ఉంటుందోనంటూ ఆయా పార్టీల నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.