Lagacherlaకు ఫ్యాక్ట్‌ ఫైండింగ్ కమిటీ.. పోలీసులతో మహిళా సంఘాల ఘర్షణ

లగచర్ల ఘటనలో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు, ఘటనకు సంబంధించి నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు లగచర్ల బయల్దేరిన మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

Update: 2024-11-19 08:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: లగచర్ల ఘటనలో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు, ఘటనకు సంబంధించి నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు లగచర్ల బయల్దేరిన మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో పాటు పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా సంఘాల నేతలు.. పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని, తమ దుస్తులు సైతం చించేశారని ఆరోపించారు. మీడియా కూడా లేకుండా వెళ్తామన్న అంగీకరించడం లేదని, తమతో పాటు పోలీసులు కూడా రావచ్చని చెప్పినా.. వినిపించుకోకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.

‘లగచర్లలో జరిగిన సంఘటనలను ప్రపంచానికి తెలియజేయాలంటూ బాధితుల నుంచి ఫోన్లు వచ్చాయి. పోలీసులు తమను లైంగికంగా వేధించారంటూ, అసభ్యంగా తిట్టారంటూ లగచర్లలో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్తుంటే తమపై పోలీసులు దౌర్జన్యం చేశారు. మాతో పాటు పోలీసులను కూడా రావాలని కోరినా వాళ్లు రాకపోగా.. మమ్మల్ని కూడా అనుమతించటంలేదు. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేందుకు వెళ్తున్న మమ్మల్ని ఆపాల్సిన అవసరమేముంది? నిజంగా పోలీసులు మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులకు పాల్పడకపోతే మమ్మల్ని ఎందుకు అనుమతించటం లేదు? జిల్లా ఎస్సీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో మాట్లాడినప్పటికీ లగచర్ల వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడం ఏంటి? పోలీసులు, ప్రభుత్వ తీరుపై మాకు అనుమానంగా ఉంది’ అంటూ మహిళా సంఘాల నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లగచర్లలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు, దౌర్జన్యాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారు. 


Similar News