గోషామహల్‌లో తిరంగా యాత్ర తీస్తే కేసు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారు: ఎమ్మెల్యే రాజాసింగ్
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు గోషామహల్ పరిధిలో జాతీయ జెండాను ఎగురవేసిన ఆయన.. సమావేశంలో మాట్లాడుతూ.. తాను, తన కార్యకర్తలు గోషామహల్‌లో తిరంగా యాత్ర తీస్తే కేసు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ యువ నేతలు స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో గోషామహల్ తిరంగా యాత్ర చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పోలీసులు తమ నేతలకు కాల్ చేసి బెదిరిస్తున్నారని.. గుర్తు చేశారు. ఈ దేశానికి అనేకమంది స్వాతంత్ర్య సమరయోదుల ప్రాణ త్యాగాల స్వాతంత్ర్యం వచ్చిందని.. అలాంటి రోజును పురస్కరించుకుని గోషామహాల్ లో ర్యాలీ చేస్తుంటే ప్రొత్సహించాల్సింది పోయి బెదిరిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. అలాగే తాము ఎట్టి పరిస్థితుల్లో వందల మంది కార్యకర్తలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తిరంగా యాత్ర నిర్వహించి తీరుతామని,, తమపై ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసులు పెడితే.. లీగల్ గా ఎదుర్కొవడం తో పాటు.. సదరు పోలీస్ స్టేషన్ పేరును, తమ పై కేసు నమోదు చేసిన అధికారి పేరును సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తామని.. స్వాంతంత్య్ర వేడుకలు నిర్వహించినందుకు కేసు నమోదు చేసిన పోలీస్ స్టేషన్ ను దేశ వ్యాప్తంగా ట్రోల్ చేస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు.