రష్యా పర్యటనలో ప్రధాని మోడీ గుడ్ న్యూస్
రష్యా పర్యటనలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సవాళ్లను సవాల్ చేయడం నా తత్వం అని, అది నా డీఎన్ఏలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితికి తీసుకువచ్చామన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మాస్కోలో భారత సంతతికి చెందిన ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్- రష్యా మైత్రి కొత్త పుంతలు తొక్కుతున్నదని, మన దేశం కష్ట సుఖాల్లో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందన్నారు. వార్ జోన్ నుంచి భారత విద్యార్థులు సురక్షితంగా బయటపడేందుకు సాయపడినందుకు పుతిన్‌కు ధన్యవాదాలు తెలిపారు. రష్యాకు తానొక్కడినే రాలేదని 140 కోట్ల మంది ప్రేమను, భారత దేశ మట్టి వాసనను మోసుకొచ్చానన్నారు. ఆత్మవిశ్వాసం భారత్‌కు అతిపెద్ద ఆయుధం అని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్టంగా ఉందని, త్వరలోనే మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతానన్నారు. వరుసగా మూడుసార్లు ఒకే పార్టీ అధికారంలోకి రావడం 60 ఏళ్ల తర్వాత సంభవించిందని, రాబోయే పదేళ్లు భారత దేశానికి అత్యంత సంక్లిష్టమైన సమయం అని అన్నారు. ఈ సందర్భంగా రష్యాలోని కజాన్‌లో 2 కొత్త కాన్సులేట్‌లను ప్రారంభించబోతున్నట్లు మోడీ ప్రకటించారు. రష్యాలో ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు.
రష్యా ఆర్మీలో ఉన్న భారతీయులకు ఊరట:
ప్రధాని మోడీ రష్యా పర్యటన సందర్భంగా భారత్‌కు దౌత్య విజయం దక్కింది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పాల్గొంటున్న భారతీయులకు ఊరట లభించింది. క్రెమ్లిన్ సైన్యంలో పనిచేస్తున్న ఇండియన్స్‌ను విడుదల చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. సైన్యంలో పనిచేస్తున్న భారత పౌరులను వెంటనే విధుల నుంచి వెనక్కి రప్పిస్తామని.. స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.