గురుకుల విద్యార్థులు అత్యున్నత శిఖరాలకు చేరేలా ప్రణాళికలు

గురుకుల విద్యార్థులు అత్యున్నత శిఖరాలకు చేరేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు.

Update: 2025-04-02 15:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకుల విద్యార్థులు అత్యున్నత శిఖరాలకు చేరేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు. టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ గురుకులంలో చదువుతన్న విద్యార్థులు 8 వ తరగతి నుండే ఫౌండేషన్ కోర్సులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు కోచింగ్​సెంట్లకు ధీటుగా ఐఐటీ, నీట్, యూపీఎస్​సీ ప్రవేశ పరీక్షలకు స్టూడెంట్స్​సన్నధం చేసేందుకు టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ యంత్రాంగం రేఢీ అయిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు చర్యలు కూడా చేపట్టింది.

తెలంగాణలోని 10 కాలేజీల్లోనూ ఫౌండేషన్ కోర్సులు..

టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ ఆధ్వర్యంలో నడుపబడుతున్న హైదరాబాద్ లోని గౌలిదొడ్డి , కరీంనగర్ జిల్లాలో సీఓఈ ఇంటర్ కళాశాలలో అడ్మిషన్ లభించాలంటే ఒక అదృష్టం ఉండాలని తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు అలాగే తల్లిదండ్రుల నోటిన పలికే మాటలు. ఈ రెండు కళాశాలలో రెండు సంవత్సరాల కాలపరిమితిలోనే ఇంటర్ విద్యార్థిని విద్యార్థులు అకడమిక్ సిలబస్తో పాటు ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాలలలు అలాగే ఎంబీబీఎస్​కోర్సులో చేరేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఐఐటీ, జేఈఈతోపాటు నీట్​ లాంటి ప్రవేశ పరీక్షలో అధిక సంఖ్యలో ర్యాంకులు సాధించడం జరుగుతోంది. పదవ తరగతి అనంతరం ఈ రెండు కళాశాలలో సీట్లు లభించకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు సహితం ఇతర కళాశాలలో అడ్మిషన్ కు అంతగా ఆసక్తి కనపరిచే వారు కాదు. గౌలిదొడ్డి, కరీంనగర్ సీఓఈ విద్యా సంస్థల మాదిరిగా రాష్టంలోని 10 కళాశాలలను ఇదే తరహాలో తీర్చి దిద్దాలని సంకల్పించారు.

అణగారిన వర్గాల స్టూడెంట్స్ భవిష్యతుకు..

ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల బంగారు భవిష్యతుకు వారు అత్యున్నత శిఖరాలకు చేరేలా ఒక నూతనమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి డా. వి. ఎస్. అలగు వర్షిణి ఈ ఫౌండేషన్ కోర్సుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో విద్యారులు ఇప్పుడు కేవలం ఇంటర్ విద్యను అభ్యసిస్తూ ఈ రెండు కళాశాలలో అనగా గౌలిదొడ్డి, కరీంనగర్ సీఓఈ విద్యా సంస్థల నుండి మంచి ర్యాంకులు సాధిస్తున్న నేపథ్యంలో మరో 10 కళాశాలలో 8 వ తరగతి నుండే ఫౌండేషన్ కోర్సులను అనగా ఇప్పుడు రెగ్యులర్ గా అందిస్తున్న నీట్, ఐఐటీ, జేఈఈ, క్లాట్, క్యూఏట్, యూపీఎస్​సీ వంటి కీలకమైన పోటీ, ప్రవేశ పరీక్షల్లో అత్యధిక స్కోర్ చేయడంతో పాటు మన గురుకుల విద్యార్థులు మరిన్ని ర్యాంకులు మంచి సీట్లు సాదించేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ ఫౌండేషన్ కోర్సును అమలు చేసేలా పలువురు విద్యా రంగ నిపుణులు సూచించడం, పలు దఫాలుగా గురుకుల కళాశాలల అధ్యాపకులు, అలాగే హైస్కూల్ స్థాయి విద్యార్థుల తల్లిదండ్రులు అమూల్యమైన సూచనలు చేసారు. వీటన్నిటిని క్రోడీకరించి టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ అంశంపై పలు దఫాలు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది

మెరిట్ ఆధారిత విద్యార్థులకు శిక్షణ..

8 వ తరగతి నుండే నీట్, ఐఐటీ జేఈఈ, క్లాట్, క్యూఏట్, యూపీఎస్​సీ వంటి కీలకమైన పోటీ, ప్రవేశ పరీక్షల్లో ఈ తరహా ఫౌండేషన్ కోర్సు లో నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పించేందుకు గురుకుల కార్యదర్శి ప్రత్యేక దృష్టిసారించారు. ఈ కోర్సులను పటిష్టంగా పకడ్బందీగా అమలు చేసేలా ఒక కార్యాచరణ ప్రణాళికను సైతం రూపొందించడం జరిగింది. సాంఘిక సంక్షేమ గురుకులలో ప్రస్తుతం చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం 2025-26 (8వ తరగతిలో చేరే వారు) ఈ ఫౌండేషన్ కోర్సుపై ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఒక ప్రవేశ పరీక్షను నిర్వహించి అధిక మార్కులు సాధించిన మెరిట్ ఆధారిత విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులో చేరేందుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.

గురుకుల చరిత్రలోనే గేమ్ ఛేంజర్.. ​

ఈ ఫౌండేషన్ కోర్సు అమలుకు మైక్రో షెడ్యూల్, వీకెండ్ టెస్ట్ , వ్యక్తిగత కౌన్సిలింగ్, నీట్, ఐఐటీ, జేఈఈతో పాటు, క్లాట్, క్యూఏట్, యూపీఎస్​సీ పోటీ పరీక్షల్లో అత్యున్నత నైపుణ్యం, నిష్ణాతులైన టీచింగ్ అనుభవం ఉన్నా అధ్యాపకులతో విద్యార్థులకు ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా శిక్షణ ఇచ్చేలా ప్లాన్ రూపొందించారు. ఇది గురుకుల సొసైటీ ఏర్పడిన నాటి నుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక మైలు రాయిగా నిలువనుంది. అలాగే, గురుకుల చరిత్రలో ఒక గేమ్ ఛేంజర్​గా మారనుంది. ఈ శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి నిరుపేద, కుటుంబాలకు చెందిన దళిత, బడుగు బలహీన వర్గాలతో పాటు ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇలాంటి శిక్షణ ఇవ్వడం వల్ల అత్యున్నత శిఖరాలకు అధిరోహించేందుకు దోహదపడుతుందని కార్యదర్శి డా. వి. ఎస్. అలగు వర్షిణి విశ్వాసం వ్యక్తం చేశారు.

Similar News