బీఆర్ఎస్‌లో చేరిన పీజేఆర్ కొడుకు.. కేసీఆర్ కీలక హామీ
దివంగత పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: దివంగత పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా విష్ణువర్దన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లో ఈ కార్యక్రమం జరగ్గా.. విష్ణువర్దన్ రెడ్డితో పాటు నాగం జనార్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ గూటికి చేరారు. పీజేఆర్ తనకు మంచి మిత్రుడని, విష్ణువర్దన్ రెడ్డికి బీఆర్ఎస్‌లో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. విష్ణువర్దన్ రెడ్డి భవిష్యత్ తన బాధ్యత అని తెలిపారు.
ఇక నాగం జనార్ధన్ రెడ్డి చాలా సీనియర్ నేత అని, ఆయన సలహాలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 14 సీట్లలో గెలవాలని దిశానిర్దేశం చేశారు. కాగా నాగం, విష్ణువర్దన్ రెడ్డి కాంగ్రెస్‌లో టికెట్ ఆశించి భంగపడ్డారు. జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి జనార్దన్ రెడ్డి టికెట్ ఆశించారు. కానీ వారిద్దరికి చుక్కెదురైంది. దీంతో బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.