వ్యక్తిగత జీవితాలపై రాద్దాంతం వద్దు..ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకున్నది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలో తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలని మీడియాకు సూచన చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారని, అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకోవడం లేదని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సీజే ధర్మాసనం విచారణ జరిపింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవరస రాద్దాంతం చేయద్దని జడ్జీలు, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా సూచించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్ నంబర్ ప్రచురించినట్లు ప్రస్తావించిన కోర్టు.. ఇందుకు సంబంధించిన వార్తల విషయంలో మీడియా సంయమనం, బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. కాగా ఈ కేసు దర్యాప్తుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశింది. దీంతో ఈ నెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేసు తదుపరి విచారణను హైకోర్టు జులై 23కు వాయిదా వేసింది.