అమరుల స్తూపం వద్ద ఉరేసుకున్నా కేసీఆర్ ను ప్రజలు నమ్మరు: Revanth Reddy

పేదల ప్రభుత్వంపై మామ, అల్లుళ్లు అక్కసు వెళ్లగక్కుతున్నారని కేసీఆర్, హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Update: 2024-02-15 13:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం పదవి రావాలంటే హరీశ్ రావు మరో ఔరంగజేబు అవతారమెత్తాలే తప్ప ఆ పదవి దక్కదన్నారు. వెన్నుపోటుకు ఔరంగజేబు మారుపేరు అని.. గడిచిన పదేళ్లుగా అధికారంలో ఉండి సమస్యలు పరిష్కరించకుండా ఇప్పుడు మాకు అధికారం ఇవ్వాలని అడుగుతున్నారని ధ్వజమెత్తారు. సలహాలు కావాలంటే ఇస్తానని కేసీఆర్ అంటున్నారని అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వమంటే మాత్రం రావడం లేదని సెటైర్లు వేశారు. గురవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుంటే పేదల ప్రభుత్వంపై మామ, అల్లుళ్లు అక్కసు వెళ్లగక్కుతున్నారని కేసీఆర్, హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

మీపై ప్రజలు సానుభూతి చూపరు:

గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుని.. దాచుకునేందుకే సమయం అంతా కేటాయించిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఊడగొడితే ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని మేము చెప్పామని, కేసీఆర్ కుటుంబం ఉద్యోగాలు ఊడగొట్టినందుకే ఇవాళ యువతకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. మీరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టి కాళ్లు చేతులు విరగొట్టుకున్నా, అమరవీరుల స్థూపం వద్ద ఉరేసుకుని వేలాడిన ఈ రాష్ట్రాన్ని దోచుకున్న మీ పట్ల ప్రజలు సానుభూతి చూపరని, ఇకనైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాలన్నారు.

కేటీఆర్ ను కూర్చోబెడదామంటే నేనొచ్చానని అక్కసు:

బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డను కడితే ఆ బ్యారేజీ పేక మేడలా కూలిందని బీఆర్ఎస్ అవినీతిపై ఇవాళ కాగ్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీద ఎప్పుడూ చూడలేదన్నారు. మేడిగడ్డకు రమ్మంటే రావడం లేదన్నారు. కూత వేటు దూరంలో ఉన్న అసెంబ్లీకి రమ్మంటే కాలు నొప్పి, చేతికి కర్ర వచ్చింది. కానీ సానుభూతి కోసం 150 కి.మీ దూరంలో ఉన్న నల్గొండ సభకు వెళ్లారని ధ్వజమెత్తారు. ఆయనకు నేను సలహా అడగాలట.. సలహా అడుగుదామని అసెంబ్లీకి రమ్మంటే రావడం లేదు. సభకు రాకుండా పారిపోయిందే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిపై అక్కసుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సీట్లు తన కొడుకు కేటీఆర్ కూర్చుంటాడనుకుని వాస్తు కోసం సచివాలయాన్ని నిర్మిస్తే ఆ కుర్చిలో నల్లమల ప్రాంతం నుంచి వచ్చిన ఓ రైతు బిడ్డ కూర్చున్నారని అది కేసీఆర్ కు నచ్చడం లేదన్నారు. కేసీఆర్ దశ బాగోలేదు కాబట్టే ఫామ్ హౌస్ లో పడ్డారని ఇకనైనా ఆయన అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలు, నిరుద్యోగులు ఏ మార్పు కోరుకున్నారో తెలుసుకోవాలన్నారు. మేము అధికారంలోకి వచ్చి ఎక్కడ కుండ ఉంది, ఎక్కడ గిన్నె ఉంది. ఎక్కడ పొయ్యి ఉందో సర్దుకుని వంట వండుదామనుకునే లోపే ఈ ప్రభుత్వం వంట వండం లేదని, ప్రజలను ఉపవాసం ఉంచుతున్నారని మా పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలో గ్రూప్ -1, డీఎస్సీ:

పదేళ్లు అధికారంలో ఉన్న మీకు నిరుద్యోగ యువతకు ఎందుకు నియామక పత్రాలు ఇవ్వడానికి ఒక్కరోజు సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. 70 రోజుల్లో మేము సాఫ్ట్ నర్సులు, సింగరేణి కార్మికులు, పోలీసులు, గురుకుల టీచర్లు దాదాపు 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. గత ప్రభుత్వం విద్య మీద 6 శాతమే ఖర్చు చేసిందని కానీ మేము 10 నుంచి 12 శాతానికి పెంచామన్నారు. రేషనలైజేషన్ పేరుతో 6,453 పాఠశాలలను మూసివేసి కేసీఆర్ పేదవారికి చదువుకు దూరం చేశారని ధ్వజమెత్తారు. కుట్రపూరితంగా కేసీఆర్ ఈ పాఠశాలలను మూసివేయించారు. మా ప్రభుత్వం నిర్దిష్టమైన ఆలోచనతోని మెగా డీఎస్సీని నిర్వహించి అన్ని పాఠశాలలను తెరిపిస్తామన్నారు. పేద వారికి విద్యను అందుబాటులోకి తీసుకువస్తాం. ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పుతున్నామని యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ లో నియామకాలు చేపడతామన్నారు. వనపర్తిలో ఓ అమ్మాయి కాలేజీ ఫీజు డబ్బులు తల్లిదండ్రులను అడగలేక వారి బాధలు చూడలేక ఆత్మహత్యకు పాల్పడింది. కేసీఆర్ నీకు కొంచమైనా బాధ కలగలేదా మీకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News