ఓపిక నశిస్తే ఇంతే.. తాళాలు పగులగొట్టి డబుల్ బెడ్ రూం ఇళ్లు స్వాధీనం
తాళాలు పగులగొట్టి డబుల్ బెడ్ రూం ఇళ్లు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.
దిశ, డైనమిక్ బ్యూరో: పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, కేటాయింపుల్లో జాప్యంపై లబ్దిదారుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇళ్ల కోసం ఎదురు చూసి ఓపిక నశించడంతో తాళాలు బద్దలు కొట్టి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మార్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక సార్లు సర్వే నిర్వహించినప్పటికీ ఇళ్లను మాత్రం పంపిణీ చేయలేదు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్ రూం ఇళ్ల తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరులో జాప్యం కారణంగా తాళాలు బద్దలు కొట్టి ఇళ్లను స్వాధీనం చేసుకున్న ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో చోటు చేసుకున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికే ఇళ్లను కేటాయించకపోవడంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిర్మాణాలు పూర్తయిన చోట్ల వెంటనే ప్రజలకు పంపిణీ చేయాలని కోరుతున్నారు.