Seethakka: త్వరలో దివ్యాంగులకు పెన్షన్ పెంచుతాం: మంత్రి సీతక్క గుడ్ న్యూస్
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది దివ్యాంగుల (Disabled people) సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. త్వరలో దివ్యాంగుల పెన్షన్లు (Pensions) పెంచుతామన్నారు. వారి స్వయం ఉపాధి కోసం స్కూటర్లు ఇస్తామని చెప్పారు. దివ్యాంగులు తమ లోపాలను చూసి బాధపడొద్దని, మీ ప్రతిభ చూస్తే మీరు సకలాంగులకు తక్కువేమీ కాదన్నారు. చిన్న లోపాన్ని చూసుకుని మానసికంగా కుంగి పోవద్దని ఆత్మ న్యూనత అవసరంలేదన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీతక్క హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, ఉపాధి కోసం నిధులు వెచ్చిస్తున్నామని, దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.50 కోట్ల రూపాయలను కేటాయించిందని, ప్రత్యేకంగా జాబ్ పోర్టర్‌ను అందుబాటులోకి తెచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. వికలాంగుల పింఛన్‌ను కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా పెంచట్లేదని, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లనే మోడీ (Modi) ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు.
ఈనెల 7న వారికి నియామక పత్రాలు
ట్రాన్స్‌జెండర్ల (Transgenders) కోసం ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. పోలీస్ శాఖలో వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ట్రాఫిక్ విభాగంలో వారి సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఈనెల 7న ట్రాఫిక్ విభాగంలో వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేస్తారని చెప్పారు.