Mahesh Kumar Goud: అప్పుడెందుకు మాట్లాడలేదు?.. రుణమాఫీపై మోడీకి పీసీసీ చీఫ్ కౌంటర్

రుణమాఫీ విషయంలో ప్రధాని చేసిన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-10-07 06:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైతు రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. వ్యవసాయమే వెన్నుముకగా ఉన్న దేశంలో రైతులకు రుణమాఫీ చేసిన విషయంలో ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయంగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తే అప్పుడు మౌనంగా ఉన్న ప్రధాని.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 22 లక్షలకు పైగా రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన మాపై విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా మహేశ్ కుమార్ గౌడ్ ఈ విమర్శలు చేశారు. రుణమాఫీ ఎన్నికల్లో మేమిచ్చిన వాగ్ధానమే కాకుండా ఇది మా నిబద్ధత అన్నారు.

మీకు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో రైతు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణలో మాదిరిగా రైతులకు ఎందుకు రుణాలు మాఫీ చేయడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతున్నారని గుర్తు చేశారు. ఇకనైనా విమర్శలు కాకుండా రైతుల కోసం కలిసి పనిచేద్దామని అన్నారు. రాష్ట్రంలో రెన్యువల్ కానీ, ఇతర సాంకేతిక సమస్యల కారణంకో కొంత మంది రైతులకు రుణమాఫీ కాలేదని వారి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాల్లో హెల్ప్ డెస్కులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. 


Similar News