BRS vs CONGRESS: విగ్రహావిష్కరణపై డైలాగ్ వార్.. కేటీఆర్ కు పీసీసీ చీఫ్ కౌంటర్

కేటీఆర్ వ్యాఖ్యలకు నూతన పీసీసీ అధ్యక్షుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-09-16 08:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో విగ్రహ రాజకీయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో రాజీవ్ విగ్రహంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విగ్రహావిష్కరణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను క్షమించదంటూ కామెంట్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ స్పందిస్తూ.. చదువుకున్నానని చెప్పుకునే కేటీఆర్.. రాజీవ్ విగ్రహ ఏర్పాటు విషయంలో రాద్ధాంతం చేయడం తగదంటూ హెచ్చరించారు. దీంతో ఇరువురి మధ్య డైలాగ్ వార్ హాట్‌హాట్‌గా మారింది.

స్వార్థ రాజకీయాలకు తెర తీస్తారా? : కేటీఆర్

సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఇవాళ సీఎం రేవంత్ ఆవిష్కరించనున్న నేపథ్యంలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ ఆత్మతో ఆటలాడుతారా? తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా? తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఊపిరి తీస్తారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా? తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచీని దెబ్బతీస్తారా? తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా? తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.. తుచ్ఛమైన స్వార్థ రాజకీయాలకు తెర తీస్తారా? నాలుగు కోట్ల ప్రజల గుండె చప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్‌గాంధీ తండ్రి విగ్రహం పెడతారా..? కాంగ్రెస్‌ను తెలంగాణ సమాజం క్షమించదు.. జై తెలంగాణ!’ అంటూ ట్వీట్ చేశారు.

కేటీఆర్ అవివేకానికి నిదర్శనం : మహేశ్‌కుమార్ గౌడ్

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఓ మీడియా చానల్‌తో మాట్లాడిన టీపీసీసీ చీఫ్.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం అహర్నిశలు పాటుపడటమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అని గుర్తుచేశారు. గాంధీ కుటుంబం త్యాగాలపై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ తల్లి పేరు మీద ఏ రకమైన పనులు చేసిందో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ వాదులను అవమానించేలా వారి పరిపాలన సాగిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో మాకు ఓ స్పష్టమైన అవగాహన ఉందన్నారు. విగ్రహ ఏర్పాటును రాద్ధాంతం చేయడం, రాజీవ్‌ను కించపరిచేలా మాట్లాడటం చదువుకున్నానని చెప్పుకునే కేటీఆర్‌కు తగదని హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో అమరవీరుల స్థూపం కడితే అక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన ఏ ఒక్క అమరవీరుడి పేరైనా దానిపై ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడుగడుగునా కాలరాసిందే కేసీఆర్ కుటుంబం.. అని ఆరోపించారు. నిజంగా మీరు తెలంగాణ సెంటిమెంట్‌ను కాపాడి ఉంటే, అమరుల ఆకాంక్షలను నెరవేర్చి ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు గద్దె దించుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు కలలు కంటుంటే ఆశ్చర్యం వేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో ఉన్న బీఆర్ఎస్ గురించి ప్రజలకు తెలిసిపోయిందన్నారు.


Similar News