Notices To Kcr: త్వరలో కేసీఆర్‌కు నోటీసులు? ‘కాళేశ్వరం’పై పీసీ ఘోష్ కమిషన్ కీలక నిర్ణయం!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు త్వరలో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయవిచారణ తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న జస్టిస్ ఘోష్.. ఇవాళ్టి నుంచి తన పనిని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో ఇవాళ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ పెద్దలకూ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్నది. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెలాఖరుతో పీసీ ఘోష్ పదవీ కాలం ముగియనున్నది. కానీ ఎంక్వయిరీ రిపోర్టును అందించడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. నిజానికి ఈ కమిషన్ గడువు జూన్ 30తో ముగియగా, మరో రెండు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఈ నెలతో ముగియనున్నది.
ఇవాళ విచారణకు వి.ప్రకాశ్ హాజరు
జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు వివరించినట్లు తెలుస్తున్నది. అఫిడవిట్ల అధారంగా తదుపరి విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రెడీ అయింది. అయితే ఇప్పటికే ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఉన్నాతాధికారులు, విశ్రాంత ఇంజనీర్లు, ఇతరులను విచారణ చేసిన కమిషన్ వారి వద్ద నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. అయితే ఓ మాజీ సీఎస్ మినహా మిగతా అందరూ కమిషన్‌కు తమ వాదనలను అఫిడవిట్ల రూపంలో సమర్పించారు.
క్రాస్ ఎగ్జామినేషన్!
అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా వారు సమర్పించిన వివరాలన్నింటినీ కమిషన్ పూర్తి స్థాయిలో విశ్లేషిస్తోంది. అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేయబోతున్నట్లు తెలుస్తున్నది. అయితే సాంకేతిక అంశాలపై కసరత్తు దాదాపు పూర్తి చేసిన కమిషన్ ఇక ఆర్థిక అంశాలపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం.