నేను తెలంగాణలో పుట్టి ఉంటే బాగుండేది: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన నేల అని.. తాను తెలంగాణలో పుట్టి ఉంటే బాగుండేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన నేల అని.. తాను తెలంగాణలో పుట్టి ఉంటే బాగుండేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు ఆలయంలో మంగళవారం ఎన్నికల ప్రచారం రథం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక భూమి పోషించింది తెలంగాణ ప్రజలే అని కొనియాడారు. సాయుధ పోరాటం నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ప్రజలు అద్భుతమైన పోరాట పటిమ చూపారని ప్రశంసించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తే తనకు ప్రేరణ అని.. పోరాటాల గడ్డ తెలంగాణలోనే తన పార్టీ జనసేన పుట్టిందని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేలలోనే పోరాట స్ఫూర్తి ఉందని అన్నారు. అన్యాయాలకు ఎదురు తిరిగితే వచ్చేంది తెలంగాణ అని పేర్కొన్నారు.
తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుండి జనసేన పోటీ చేస్తోందని పవన్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. 7 నుండి 14 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలో కోసం బీఆర్ఎస్ పార్టీ పెట్టడాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో జనసేనతో పొత్తు కోసం ఎవరైనా వస్తే చూస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు సందేశాలు ఇచ్చే స్థాయిలో తాను లేనని అన్నారు. తెలంగాణలో కొన్ని పరిమితులతోనే ఆట ఆడుతామని.. చాలా సందర్భాల్లో తాను తగ్గి మాట్లాడానని.. కానీ భయపడి మాత్రం కాదన్నారు.
తాను ఒక్కసారి గళమెత్తితే ఏ స్థాయి నాయకుడు అయినా చూడనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భావోద్వేగంతో కూడిన రాజకీయం ఉంటే.. ఏపీలో మాత్రం కులాల గీతాల మధ్య రాజకీయం నడుస్తోందని అన్నారు. అందుకే ఏపీ రాజకీయాలను ఎదుర్కొవడం కష్టమని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తానని.. తెలంగాణ అసెంబ్లీలో కనీసం 10 మంది జనసేన ఎమ్మెల్యేలు అయిన ఉండాలన్నదే తన కోరిక అని పవన్ కొండగట్టు ఆంజన్న సాక్షిగా వెల్లడించారు. అంతేకాకుండా పోటీ చేయని స్థానాల్లో కుడా జనసేన ప్రభావం చూపించాలని పేర్కొన్నారు. పొత్తు ఎవరితో పెట్టుకున్నా.. పొలిటికల్ పవర్‌లో భాగం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి : వారాహిపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మొదటి స్పీచ్ ఇదే! (వీడియో)