Coromandel train accident: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు!
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎఫెక్ట్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పైనా పడింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎఫెక్ట్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పైనా పడింది. ప్రమాదం నేపథ్యంలో ఒడిశా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు శనివారం దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వడంలో విఫలం కావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఏ రైలును రద్దు చేశారో, ఏది ఎప్పుడు బయలుదేరుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర గందరోగళానికి గురయ్యారు.
సికింద్రాబాద్-హౌరా రైలు క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తూ స్టేషన్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఫలితంగా విపరీతమైన రద్దీ నెలకొంది. నిన్న ఉదయం, సాయంత్రం బయలుదేరాల్సిన ఈస్ట్‌కోస్ట్, షాలిమార్, ఫలక్‌నుమా రైళ్లను రద్దు చేశారు. గౌహతి ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా నడవగా, సికింద్రాబాద్ రావాల్సిన మూడు రైళ్లను రద్దు చేశారు. దీంతో నిన్నటి నుంచి తాము ఎక్కే రైలు ఎప్పుడు వస్తుందోనని స్టేషన్లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.