జగిత్యాలలో మాదే అసలైన కాంగ్రెస్ కుటుంబం : ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాలలో మాదే అసలైన కాంగ్రెస్ కుటుంబమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-23 08:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : జగిత్యాలలో మాదే అసలైన కాంగ్రెస్ కుటుంబమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యపై ఆయన స్పందిస్తూ హత్యా సంఘటనను నేను తీవ్రంగా ఖండించానని, నిందితులెవరైనా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరడం జరిగిందన్నారు. మేము ఎపుడూ హింసని ప్రోత్సహించమని, హింసలు, హత్యలు ఎవరి ఇంట్లో జరిగాయో జగిత్యాల ప్రజలకు తెలుసన్నారు. మా కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబంమని, మొదటి నుంచి కాంగ్రెస్ తోనే ఉందని, కరీంనగర్ నుంచి తొలిపార్లమెంటు సభ్యుడు ఆకునూరు రంగారావు మా తాత అని, చొక్కారావు మా అమ్మ తరుపునా, నా సతీమణికి తాత అని గుర్తు చేశారు. నేను పుట్టింది పెరిగింది కాంగ్రెస్ లోనే అన్నారు.  కాంగ్రెస్ లో అవకాశాలు రాకపోవడంతోనే నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచానన్నారు.

నేను కాంగ్రెస్ లో చేరడంపై ఎవరికి అభ్యంతరాలు అవసరం లేదన్నారు. ఇదే జీవన్ రెడ్డి ఎన్టీ రామారావు మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో చేరి ఇంకో పార్టీలో కలవలేదా ? అని ప్రశ్నించారు. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. దానికి జీవన్ రెడ్డి పదే పదే పార్టీ ఫిరాయింపులు అని మాట్లాడటం సమంజసం కాదన్నారు. 


Similar News