Cm Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్.. సభలో రేవంత్ రెడ్డి ప్రకటన
ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి మరో కీలక ప్రకటన చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఏబీసీడీ వర్గీకరణ ఇతర రాష్ట్రాల కంటే ముందు మేమే అమలు చేస్తాం. ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేస్తామన్నారు. ఇందుకోసం అవసరం అయితే ఆర్డినెన్స్ ను తీసుకువస్తామన్నారు. మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుందని, మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాలని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ మోసం:
ఎస్సీ వర్గీకరణ కోసం 27 ఏళ్లుగా పోరాటం చేశారు. మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు దశాబ్ధాలుగా పాటు పోరాటం చేస్తున్నారని సీఎం గుర్తు చేశారు. గతంలో ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను సభ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం బహిష్కరించిందన్నారు. వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి మదిగ సోదరులను బీఆర్ఎస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మా ఎమ్మెల్యేల బృందాన్ని, అడ్వకేట్ జనరల్ ను ఢిల్లీకి పంపించామని గుర్తు చేశారు. అక్కడ న్యాయకోవిదులతో చర్చించి సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించేలా చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పోరాటంతోనే సుప్రీంకోర్టు అనుకూల తీర్పు వచ్చిందన్నారు. ఈ తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు.