Operation Aakarsh: ఆపరేషన్ ఆకర్ష్‌పై కాంగ్రెస్ ఫోకస్..! ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేల సెగ్మెంట్లే టార్గెట్

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్ తన ఆపరేషన్‌ను మొదలుపెట్టింది.

Update: 2024-12-06 02:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్ తన ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్లలో మెజార్టీ సీట్లు సాధించడం సులువేనని భావిస్తున్న కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లలోనూ తమ సత్తా చాటాలని టార్గెట్ పెట్టుకున్నది. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సెగ్మెంట్లపై ఫోకస్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన డ్రైవ్‌ను మొదలు పెట్టనున్నది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64 సీట్లు రాగా, ఒక సీటును సీపీఐ గెలుచుకున్నది. బీఆర్ఎస్‌కు 39 సీట్లు స్థానాలు రాగా, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు చొప్పున వచ్చాయి. ఇక బీఆర్ఎస్‌లోని 39 మందిలో ఇప్పటికే 10 మంది కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. (టెక్నికల్ లేకుండా)మరి కొందరు కాంగ్రెస్ పార్టీ, సీఎంతో మంచి రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. కానీ, ఆయా నియోజకవర్గాల్లోని గ్రౌండ్ కేడర్ తమకు సహకరిస్తారా? లేదా? అని కాంగ్రెస్ కొంతవరకు డైలమాలో ఉన్నది.

అందుకే క్షేత్రస్థాయిలో కీలకమైన నేతలను తన పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. మాజీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ తదితర కేడర్ కలిగిన క్షేత్రస్థాయి లీడర్లను కాంగ్రెస్ గుంజుకోవాలని చూస్తున్నది. ఈ మేరకు గడిచిన రెండు రోజుల నుంచి గ్రౌండ్ లీడర్లకు టీపీసీసీ ఆహ్వానాలు అందిస్తున్నది. పదవులు, పార్టీ ప్రయోజనాలపై భరోసా ఇస్తూ తమ పార్టీలోకి రావాలని టీపీసీసీ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కమిటీలన్నీ ఆహ్వానిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌ను డీసీసీలు నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు.

అభ్యర్థులపై సెలక్షన్‌పై కూడా?

స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తన కసరత్తును మొదలు పెట్టగానే పార్టీ తరపున కూడా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రిపరేషన్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో సరైన అభ్యర్ధుల్ని నిలపెట్టి, మెజార్టీ సీట్లు సాధించాలనేది కాంగ్రెస్ లక్ష్యం. ఇందుకోసం గ్రౌండ్ కసరత్తును పెంచింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతున్నప్పటికీ సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతాయి. దీంతో క్షేత్రస్థాయిలోని ప్రజలతో సత్సంబంధాలను కలిగిన వ్యక్తులను సెలక్ట్ చేయాలని టీపీసీసీ ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది. ఇందుకు వార్ రూమ్ కేంద్రంగా ఇంటర్నల్ సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రతిపక్ష సభ్యులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ తరపున కో ఆర్డినేటర్లను త్వరలోనే నియమించనున్నట్లు పీసీసీ కార్యవర్గం పేర్కొన్నది.

మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్‌పై సీరియస్?

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను కూడా క్లీన్ చేయాలని కాంగ్రెస్ తన స్ట్రాటజీలను అమలు చేయనున్నది. ఆయా మున్సిపాలిటీ పరిధిలోని కీలక నేతలు, చైర్ పర్సన్లతో పాటు కౌన్సిలర్లు, మాజీలకు కాంగ్రెస్ కండువాలు కప్పనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 128 పురపాలక సంఘాల్లోనూ చేరికలను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ముందుకు సాగనున్నది. గ్రౌండ్ నేతలను గుంజుకుంటే, ఆటోమెటిక్‌గా పైన ఉన్న లీడర్లు పార్టీలోకి చేరతారనే అభిప్రాయంలో కాంగ్రెస్ ఉన్నది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ను తనవైపు కన్వర్ట్ చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 140 సీట్లు గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది.

Tags:    

Similar News