నిమ్స్‌లో కొనసాగుతున్న నర్సుల ధర్నా
దిశ, తెలంగాణ బ్యూరో: నిమ్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ
దిశ, తెలంగాణ బ్యూరో: నిమ్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పది రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారులు ఆ ధర్నా ముందు నుంచి పోతున్నా స్పందించడం లేదు. దాదాపు 423 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల్లోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు వివిధ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నా.. ఆరోగ్య శాఖ మంత్రి రెస్పాన్స్ లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి ధర్నాలు చేయడంతో రోగులకు ఇబ్బందిగా మారింది. సకాలంలో వైద్యం అందక నరకయాతన పడుతున్నారు. న్యాయ బద్ధమైన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.. పరిష్కరించలేకపోతే ఎలా అంటూ స్టాఫ్ నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ధర్నాలు కొనసాగిస్తామని నర్సులు నొక్కి చెబుతున్నారు.
ఏం జరిగింది..?
మెటర్నిటీ లీవ్స్ ఇవ్వకుండా నిమ్స్ యాజమాన్యం సతాయిస్తున్నదని నర్సులు మండిపడ్డారు. ఏళ్ల తరబడి రెగ్యులర్ ఎంప్లాయిస్‌తో సమానంగా పనిచేస్తున్నా.. ప్రసూతి సెలవులు ఇవ్వకుండా పేమెంట్ కట్ చేస్తున్నట్లు ఆరోపించారు. దీనితో పాటు రూల్స్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో 423 మంది స్టాఫ్ నర్సులు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. కానీ వారికి అటానామస్ రూల్స్ ప్రకారం యాజమాన్యం వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది. అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టింపు లేకుండా పోయిందని నర్సులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పైగా ప్రస్తుతం ఇస్తున్న పేమెంట్ కు పేస్లిప్లు కూడా లేవు. దీంతో అత్యవసర సమయాల్లో లోన్లు తీసుకోవడం స్టాఫ్ నర్సులకు ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా ఆరు నెలలకోసారి ఉద్యోగాలకు బ్రేక్ ఇస్తున్నారు.
ప్రస్తుతం కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు ప్రతీ ఆరు నెలలకోసారి బ్రేక్ చేస్తూ, కొత్త స్టాఫ్ గా మళ్లీ పాత వాళ్లనే విధుల్లోకి తీసుకుంటున్నారు. దీని వలన ఎంతో మంది సీనియారిటీ మిస్ అవుతున్నారు. మరోవైపు సీనియారిటీ ప్రకారం పనిచేస్తున్నోళ్లకు పర్మినెంట్ చేయాలనే విజ్ఞప్తిని నిమ్స్ ఉన్నతాధికారులు చెత్త బుట్టలో వేసినట్లు స్టాఫ్ నర్సులు విమర్శిస్తున్నారు.