ఒకే పార్టీ.. మూడు గ్రూపులు

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఆలోచన చేస్తోంది.

Update: 2023-02-28 03:25 GMT

దిశ, పెద్దపల్లి : వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీని గద్దెదించి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకు తగ్గట్లు ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు సాగుతోంది. ప్రధాన మంత్రి మోడీతో పాటు అమిత్​ షా వంటి నేతలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతుంటే క్షేత్రస్థాయిలో బీజేపీ వర్గ పోరాటాలు రోజు రోజుకూ శృతి మించుతున్నాయి.

పెద్దపల్లి బీజేపీలో మూడు గ్రూపులు కావడంతో సీనియర్​ కార్యకర్తలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో బీజేపీ మూడు గ్రూపులుగా విడిపోయింది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డిది నియోజకవర్గంలో ఒక వర్గం కాగా బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్​ రావుది మరో వర్గం.. ఇద్దరు నేతలతో ఇప్పటికే కార్యకర్తలు అయోమయానికి గురవుతుండగా పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన సురేష్​ రెడ్డిది మరో వర్గమైంది. మూడు గ్రూపుల మధ్యలో బీజేపీ సీనియర్​ నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్నారు.

ఇదీ పంచాయితీ..

కొత్తగా పార్టీలోకి వచ్చిన సురేష్​ రెడ్డి మానేరు ఇసుక తరలింపులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అందోళనలు చేయడంతో పాటు బీజేపీలో చేరికల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సురేష్​ రెడ్డి సీనియర్​ బీజేపీ నాయకులైన తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు.

ఏళ్లుగా పార్టీని పెద్దపల్లి నియోజకవర్గంలో బతికించామని గుజ్జుల వర్గం అంటుంది. అనేక ఏళ్లుగా పార్టీలో ఉంటూ ఎన్నికల సమయంలో అధికార పార్టీకి గుజ్జుల వర్గం అమ్ముడుపోవడంతో పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావడం లేదని సురేష్​ రెడ్డి వర్గం ఆరోపిస్తుంది. దుగ్యాల ప్రదీప్​ రావు వర్గం మాత్రం రెండు వర్గాల వాళ్లు ఎన్ని చెప్పినా టికెట్​ ప్రదీప్​ రావుకు వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.

పట్టించుకునేటోళ్లు ఏరీ..?

సాధారణంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాడానికి, జాతీయ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రతి రాజకీయ పార్టీకి జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఉంటాయి. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సోమారపు సత్యనారాయణ ప్రస్తుతం యాక్టివ్​గా కనిపించడం లేదు. గతంలో జిల్లా అధ్యక్ష పదవి ఆయన రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ సోమారపు రాజీనామాలను పార్టీ అధిష్టానం ఆమోదించిందా లేదా అనేది స్పష్టత లేదు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగా పెద్దపల్లి జిల్లాలో మాత్రం జిల్లా కార్యవర్గం ఖరారు కావడం లేదు. జిల్లా కార్యవర్గం లేకపోవడంతో పార్టీలో ఉన్న అంతర్గ విభేదాలు వచ్చినప్పుడు సరిదిద్దే వాళ్లు కరువయ్యారు. బీజేపీ పెద్దపల్లి నియోజకవర్గంలో మూడు గ్రూపుల మధ్య నలిగిపోతున్న కార్యకర్తలకు మనో ధైర్యం ఇచ్చే వారే కరువయ్యారు.

Also Read...

‘తెలంగాణలో మోడీ పాలన రావాలి’

Tags:    

Similar News