అసెంబ్లీ సెషన్‌కు మరోసారి KCR దూరం.. ఈ సారి కూడా ‘ప్రళయ గర్జన’ మిస్..!

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా..? లేదా..?.. అనే చర్చ ఇప్పుడు బీఆర్ఎస్‌లో మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా

Update: 2024-07-14 03:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా..? లేదా..?.. అనే చర్చ ఇప్పుడు బీఆర్ఎస్‌లో మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా అనుమానమే అనే ఊహాగానాలు వస్తుండడంతో ఆయన రాకపోవచ్చనే అభిప్రాయం మాజీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీకి హాజరవుతానని.. ‘ప్రళయ గర్జన’ను చూస్తారుగా.. అంటూ ఇటీవలే కేసీఆర్ ఓపెన్‌గా చెప్పారు. కానీ సభకు హాజరై అవమానాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో కేటీఆర్, హరీశ్‌రావులకే బాధ్యతలు అప్పజెప్పే అవకాశముందన్న వార్తలూ ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోతుండడంతో చివరకు సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతుందనే ఆందోళన కూడా ఒక కారణమని ఉదహరించారు.

కేటీఆర్, హరీశ్ రావుపైనే బాధ్యత

గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్న ఇదే సభలో ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని నిస్సహాయత కారణంగా సభా సమావేశాలకు హాజరు కాకపోవచ్చనేది గులాబీ మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో చివరకు ఎందరు మిగులుతారనే సందేహం ఉండనే ఉన్నది. కనీసం అరడజను మందైనా ఉంటారా..? అనే చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఈ సభకు హాజరుకావడం ద్వారా తన స్థాయిని తానే తగ్గించుకున్నట్లవుతుందనే వాదన ఒకవైపు, కాంగ్రెస్ సభ్యుల నుంచి విమర్శల రూపంలో అవమానాన్ని భరించాల్సి వస్తుందనే అనుమానం మరోవైపు ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీని నిలదీసే బాధ్యత కేటీఆర్, హరీశ్‌‌రావులపై పడనున్నది.

భయపెడుతున్న గత అనుభవాలు

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, జనం నిలదీసే రోజులు ఎంతో దూరంలో లేవంటూ బీఆర్ఎస్ నేతలు తరచూ మీడియా సమావేశాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ సైతం పలు సందర్భాల్లో ఇదే కామెంట్ చేశారు. అంశాల వారీగా కాంగ్రెస్‌ను కార్నర్ చేయడానికి అసెంబ్లీని వాడుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవచ్చని, నిన్నమొన్నటివరకూ తమతోనే ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడంతో వారి నుంచి కూడా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఇక నిరుద్యోగుల విషయంలో గతంలో ప్రశ్నాపత్రాల లీకేజీ, నోటిఫికేషన్ల రద్దు, హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వచ్చిన ఫలితం.. ఇలాంటివన్నీ గులాబీ పార్టీని భయపెడుతున్నాయి.

పార్టీ నేతల్లో గుబులు..

ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం, మూడు బ్యారేజీలపై విజిలెన్స్ ఎంక్వయిరీ ఇంటెరిమ్ రిపోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కరప్షన్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ, కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా కేసీఆర్‌ను, పార్టీగా బీఆర్ఎస్‌ను ఇరుకున పెడతాయన్న గుబులు కూడా లేకపోలేదు. గత సమావేశాల్లో 39 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా కనిపించిన బీఆర్ఎస్.. ఈ సమావేశాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందేమోననే సందేహం కూడా ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారంటూ ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ మీడియాతో వ్యాఖ్యానించినా రానున్న రోజుల్లో ఊహాగానాలకు తెర పడనున్నది.


Similar News