హైడ్రా రాకతో రెవెన్యూ అధికారుల్లో ఫుల్ పవర్.. కబ్జాలపై కన్నెర్ర

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలని తొలగించారు.

Update: 2024-09-04 02:44 GMT

దిశ,పటాన్ చెరు : ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలని తొలగించారు. అమీన్ పూర్ మండలం ఐలాపూర్, అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ 462 లో నిర్మాణాలను కూల్చివేశారు. మంగళవారం ఉదయం అమీన్ పూర్ తహసీల్దార్ రాధ నేతృత్వంలో కదిలిన రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు. నిర్మాణాల కూల్చివేత సమయంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అమీన్ పూర్ సీఐ సదా నాగరాజు తో పాటు పలువురు సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ ఫోర్స్ తో బందోబస్తు నిర్వహించారు. మొదట ఐలాపూర్ తండాలో కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద స్థలంలో ఉన్న స్థలంలో నిర్మాణాలను కూల్చివేసి హెచ్చరిక బోర్డు ను ఏర్పాటు చేశారు. తర్వాత అమీన్ పూర్ లోని సర్వే నెంబర్ 462 లో అక్రమ నిర్మాణల పై చర్యలు తీసుకున్నారు. సర్వే నెంబర్ 462 లో సుమారు 15 గుంటల భూమిని పక్కనే ఉన్న ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో కబ్జా చేశారన్న ఆరోపణలపై కాంపౌండ్ వాల్ ని తొలగించడంతో పాటు ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన ప్లే గ్రౌండ్ ను తొలగించారు.

అనంతరం పక్కనే ఉన్న స్థలంలో షేటర్లను, షెడ్లను కూల్చివేశారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తమ పట్టా స్థలంలో ఉన్న నిర్మాణాలను తొలగించడం అన్యాయం అంటూ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగా రెడ్డి, ఆయన కుమారుడు రుశ్వంత్ రెడ్డి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. సర్వే నిర్వహించి తమ స్థలం హద్దులు చూపి ప్రభుత్వ స్థలం ఉంటే స్వయంగా తనే అప్పగిస్తానని అధికారులకు విన్నవించుకున్నారు. అయితే ఆ స్థలం ప్రభుత్వ స్థలం అని నిర్ధారిస్తూ వారిని పోలిసుల సహాయంతో పక్కకు జరిపి కూల్చివేతలు కొనసాగించారు. ఒక్కసారిగా అధికారులకు కూల్చివేతలు మొదలు పెట్టడంతో ఆ షెటర్లలో వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారస్తులు తమ సామాన్లను భద్రపరచుకోవడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. తమ సామాన్లకు నష్టం కలుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అధికారులు సామాన్లను బయట పెట్టుకునే వరకు సమయం ఇచ్చి ఆ తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టారు.

ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలు సహించం: అమీన్ పూర్ తహసీల్దార్​ రాధ

ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందిస్తున్నాం. సర్వే నెంబర్ 462 లో విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు సర్వే చేసి నిర్ధారించాం. ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన ఫలితం లేకపోవడంతో కూల్చివేతలు చేపట్టి భూమిని స్వాధీనం చేసుకున్నాం. దానితోపాటు పక్క సర్వే నెంబర్ తో మరికొంత భూమిని కబ్జా చేసి తాత్కాలికంగా షెటర్లు, షెడ్లను ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో అక్రమంగా వెలసిన నిర్మాణాలను పూర్తిగా తొలగించాం. 15 రోజుల కింద స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చాము. అయినా స్పందన లేకపోవడంతో కూల్చివేతలు నిర్వహించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం. త్వరలో ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసి పరిరక్షిస్తాం.

ప్రభుత్వ స్థలాల ఆక్రమణల పై చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారు ఎవరైనా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వ స్థలాల్లో కూల్చివేతలు నిరంతర ప్రక్రియ. ఎప్పటికప్పుడు ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై నిజా నిజాలు నిర్ధారించి ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. వివాదాస్పద స్థలంలో ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లు ఇల్లు కొనుగోలు చేసే సమయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులను ఒకటికి రెండుసార్లు సంప్రదించి ప్రభుత్వం ద్వారా అన్ని అనుమతులు పొందిన హెచ్ఎండిఏ లేఔట్ లో మాత్రమే ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేయాలి.


Similar News