ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని రేవంత్ రెడ్డి?.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైర్!
ముఖ్యమంత్రి గారు.. ప్రచారంలో నీతులు? ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా..?, ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి గారు.. ప్రచారంలో నీతులు? ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా..?, ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అంతేగాక రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఆ వీడియోలో చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ సీఎంపై విరుచుకుపడ్డారు. నాడు.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని, ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమని అన్నట్లు తెలిపారు. భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమని, చివరికి.. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టిచంపమన్నారని గుర్తుచేశారు.
అలాగే రాజీనామా చేయకుండా చేరితే ఊళ్లనుంచే తరిమికొట్టమని కూడా చెప్పారన్నారు. మరి ఇవాళ మీరే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ.. కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా? అని బీఆర్ఎస్ నేత ప్రశ్నించారు. జంప్ జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టి.. ఏ ప్రలోభాలను ఎర వేస్తున్నారు. ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నారో చెప్పాలని మండిపడ్డారు ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని? రాజకీయంగా గోరి కట్టాల్సింది ఎవరికి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే.. రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరే అందుకే జవాబు చెప్పాల్సింది కూడా మీరే..! అని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.