మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speca Gaddam Prasad Kumar) తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించేదిగా ఉందని వినతి పత్రంలో పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నపై సమాధానం ఇచ్చే సందర్భంలో బీఆర్ఎస్ పాలనలో సీఆర్ఎస్ నిధులు (CRS Funds) రాలేదని ,నల్లగొండ నియోజకవర్గ రోడ్లకు నిధులు కేటాయించలేదని ,ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ (Uppal Eliveated Corridar) కు ఎస్క్రో అకౌంట్ తెరవలేదని చెప్పి, సభను సభ్యులను తప్పుదోవ పట్టించారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో సీఆర్ఎఫ్ నిధులు వచ్చాయని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి ఎస్క్రో అకౌంట్ తెరవడం జరిగిందని, నల్లగొండ నియోజకవర్గంలో రోడ్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు.
ఇక ఈ మూడు అంశాలకు సంబంధించిన ఆధారాలు లేఖ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఇక ఇదిలా ఉండగా.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన సమాధానం పూర్తిగా అవాస్తవమని, ఉద్దేశపూర్వకంగా సభకు తప్పుడు సమాచారం ఇచ్చి, సభా గౌరవాన్ని తగ్గించడమే కాక సభ్యుల హక్కులను భంగం కలిగించారని తెలిపారు. దీనిపై శాసన నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ శాసన సభాపక్షం తరపున మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.

