పోడు పట్టాలపై స్టే ఇవ్వలేం.. సర్కారుకు క్లారిటీ ఇచ్చిన హైకోర్టు
సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ ప్రక్రియకు స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ ప్రక్రియకు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పోడు భూములను క్రమబద్ధీకరణ పేరుతో పట్టాలు ఇవ్వడాన్ని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వ చట్టాలు, నిబంధనలు పోడు భూములకు పట్టాలు ఇవ్వడాన్ని సమర్ధించవని, ఒప్పుకోవని ఫోరం ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి (రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి) ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. పిటిషనర్ వాదనలను విన్న తర్వాత పోడు భూములకు పట్టాలను పంపిణీ చేసే ప్రక్రియకు స్టే ఇవ్వలేమని క్లారిటీ ఇచ్చింది. అయితే చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలని స్పష్టత ఇచ్చింది.
పోడు భూములకు పట్టాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో గతంలోని అటవీ హక్కుల చట్టం, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా ఉన్నట్లు పిటిషనర్ వాదించారు. ఈ కేసు విచారణలో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఇంప్లీడ్ అయ్యి పోడు భూములను ఆదివాసీ ప్రజలు దీర్ఘకాలంగా సాగుచేసుకుంటూ ఉన్నందున అటవీ, రెవెన్యూ శాఖల నుంచి ఇబ్బందుల్లేకుండా ఉండేలా పట్టాలను పంపిణీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు తరఫున వాదనలను విన్న హైకోర్టు బెంచ్.. పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 22వ తేదీకి వాయిదా వేసింది.