ఫలితాలపై ‘నో’ ఇంటర్నల్ రివ్యూ.. లీడర్లు, కేడర్‌కు ధైర్యం చెప్పని KCR

లోక్ సభ ఫలితాలు వచ్చి వారం రోజులు అవుతున్నా పార్టీ అధినేత కేసీఆర్ సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు.

Update: 2024-06-10 02:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్ సభ ఫలితాలు వచ్చి వారం రోజులు అవుతున్నా పార్టీ అధినేత కేసీఆర్ సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఇప్పటి వరకూ విశ్లేషణ లేదు.. కేడర్ కు భరోసా ఇవ్వ లేదు. ఓటమిపైన పార్టీ ఇంటర్నల్ రివ్యూ కూడా కరు వైంది. దీంతో కేడర్ అంతా నైరాశ్యంలో ఉంది. పార్టీలో ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. ఊహించని విధంగా పుంజుకుంటామని, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని కేసీఆర్ ప్రకటించినా పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు.

అవమాన భారమా? లేకుంటే ఫాల్స్ ప్రిస్టేజా? తెలియదు కానీ, ఈ నెల 4న లోక్ సభ ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఫలితాలపై మాట్లాడలేదు. కనీసం మీడియా ప్రకటన కూడా విడుదల చేయలేదు. పార్టీ లీడర్లు, కేడర్ కు సైతం ధైర్యం చెప్పలేదు. ఇదిలా ఉండగా, పార్టీ అధినేత కేసీఆర్ మౌనంపై కేడర్ లో ఆందోళన నెలకొంది. ఎందుకు మాట్లాడటం లేదన్నది చర్చనీయాంశమైంది. పార్టీలో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో పార్టీలో ఉండాలా? మారాలా? అనే సందిగ్ధం కేడర్ లో నెలకొంది. కానీ ఏపీలో కూటమి విజయం సాధించడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్ పార్టీ కేడర్ కు మాత్రం ఎలాంటి సందేశం ఇవ్వకపోవడం గమనార్హం..

కేటీఆర్, హరీశ్ రావుది అదే దారి

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్మాత్మకంగా తీసుకున్న కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు. కానీ పార్టీని గట్టెక్కించలేక పోయారు. ఓటమి తర్వాత వారు సైతం మీడియా ముందుకు రాలేదు. కేవలం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని మాత్రం ప్రకటించారు. కానీ కేడర్, నేతలకు మాత్రం ధైర్యం చెప్పలేదు. వారికి ఏ విధంగా అండగా ఉంటామని, పార్టీ కార్యక్రమాలపైనా చెప్పకపోవడంతో కేడర్ లో నైరాశ్యం నెలకొంది.

ఓటమిపైనా ఇంటర్నల్ రివ్యూ కరువు

ఫలితాలు వచ్చి దాదాపు వారం రోజులైనా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపై పార్టీ అధిష్టానం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించలేదు. ఫలితాలపై రివ్యూ కూడా నిర్వహించలేదు. కేవలం ఫాంహౌజ్ కు వెళ్లి కలిసిన నేతలతో మాత్రం ఫలితాలపై ఆరా తీసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసినా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించలేదు. కేవలం కేటీఆర్, హరీశ్ రావు ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు మాత్రం నిర్వహించారు. ఓటమిపై సమీక్షించారు. కానీ పార్టీని మాత్రం గాడిలో పెట్టలేదని, కేడర్ నేతల మధ్య సమన్వయం చేసి ఏకతాటిపైకి తీసుకురాలేక పోయారనేది మాత్రం లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు స్పష్టం చేశాయి.

పార్టీ అసెంబ్లీ, లోక్ సభ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇలా వరుస ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో కైడర్ లో నైరాశ్యం నెలకొంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై అధిష్టానం ఇంకా చర్యలు ప్రారంభించకపోవడంతో ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల్లోనూ ఎలాంటి ఫలితాలు బీఆర్ఎస్ కు వస్తాయో అన్నది నేతల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి ప్రస్తుతం గడ్డుకాలం నెలకొన్న తరుణంలో ఎంతమంది పార్టీలో ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.


Similar News