చెత్త బండ్లకు నో ఇన్సూరెన్స్.. కండిషన్‌లో లేని వెహికల్స్
చెత్త తరలించేందుకు వినియోగిస్తున్న భారీ వాహానాలకు ఇన్సూరెన్స్ కూడా లేకపొవటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ, సిటీ బ్యూరో: మహానగరవాసులకు అత్యవసరమైన, అతి ముఖ్యమైన సేవలందించే జీహెచ్ఎంసీ ప్రతి రోజు చెత్త తరలించేందుకు వినియోగిస్తున్న భారీ వాహానాలకు ఇన్సూరెన్స్ కూడా లేకపొవటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానగరంలోని మొత్తం 30 సర్కిళ్ల నుంచి స్చచ్చ టిప్పర్ల ద్వారా ప్రతి రోజు నాలుగున్నర వేల మెట్రిక్ టన్నుల నుంచి ఐదు వేల మెట్రిక్ టన్నుల వరకు చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
ట్రాన్స్ ఫర్ స్టేషన్ల నుంచి శివారులోని జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు దాదాపు 444 భారీ వాహానాల ద్వారా చెత్తను తరలిస్తుండగా, వీటిలో కేవలం 202 వాహానాలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉన్నట్లు సమాచారం. మిగిలిన 242 భారీ వాహానాలకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదని అధికారులే వెల్లడించారు. వీటిలోనూ అత్యధిక వాహానాలు కాలం చెల్లినవి కావటంతో తరుచూ మొరాయిస్తుంటాయి.
మొత్తం వెహికల్స్ ఇలా..
జీహెచ్ఎంసీ వినియోగిస్తున్న మొత్తం వాహానాలు 444 కాగా, వీటిలో సగాని కన్నా తక్కువ వాహానాలు 202 వెహికల్స్‌కు మాత్రమే ఇన్సూరెన్స్ ఉండగా, 242 వెహికల్స్ కు ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఉన్న వాహానాల వివరాలిలా ఉన్నాయి. ఈవీడీఎంలో 20 ట్రక్కులుండగా, వీటిలో 18కి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. ఎస్‌యూవీ ట్రక్‌లు ఎనిమిదికి ఇన్సూరెన్స్ ఉంది. 35 మొబైల్ టాయిలెట్స్, ఓ ఫర్చ్యూనర్, 21 ఇన్నోవాలు, 45 స్కార్పియోలు, 64 బొలారోలు, ఓ ఇండికా, 10 బైక్ లుండగా, తొమ్మిదికి ఇన్సూరెన్స్ ఉన్నట్లు అదికారులు వెల్లడించారు.
ఇక 25 టన్నర్ వెహికల్, 10 టన్నర్ 3 వెహికల్స్ , బిగ్ కంపాక్టర్ 5, ఆర్ఎఫ్‌సీ 35, 6 టన్నుల వెహికల్స్ 84, 3 టన్నుల వెహికల్స్ 2, 4 ట్రాక్టర్లు, ఆరు జేసీబీలు, రెండు ఫ్రంట్ ఎండ్ లోడర్స్, బాబ్ కట్ లు 2, వాటర్ ట్యాంకర్లు 3, వెహికల్ మౌంటెడ్ ల్యాడర్లు 12, డీసీఎంలు 7, క్యాటిల్ వ్యాన్లు 8, డాగ్ వ్యాన్ 14, టాటా ఏస్ 1,రోడ్ రోలర్ 1, స్యాట్ (సీఎస్ఆర్) 6, జీప్‌లు 4, అంబులెన్స్‌లు 7, బస్‌లు 2లకు ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు. అసలు అధికారులు చేయించే ప్రయత్నం కూడా చేయటం లేదన్న విమర్శ ఉంది.
బ్రేక్‌లు ఉండవు.. ఒక వేళ ఉన్నా లైట్లుండవ్
మోటారు వెహికల్ యాక్టు ప్రకారం భారీ వాహానాలను 15 ఏళ్లకు మించి వినియోగించొద్దన్న నిబంధన ఉంది. ఇక జీహెచ్ఎంసీకి చెందిన చెత్త తరలించే వాహానాలు పదేళ్లు మాత్రమే వినియోగించాలన్న రూల్ ఉంది. చెత్తలోని రసాయనాలతో కూడిన ద్రవం (లీచెట్) ఉండటంతో వాహానాలు మరింత త్వరగా మరమ్మతుల పాలయ్యే అవకాశముంది. కావున ఈ వాహానాలను పదేళ్ల వరకు వినియోగించుకోవచ్చు. కానీ జీహెచ్ఎంలో ప్రస్తుతం వినియోగిస్తున్న వాహానాల్లో సుమారు 20, 25 ఏళ్ల పాతవి కూడా ఉన్నట్లు సమాచారం. వీటిలో చాలా వరకు వాహానాలకు లైట్లుంటే బ్రేక్ లుండవు, బ్రేక్ లుంటే లైట్లుండని దుస్థితి నెలకొంది. గతంలో బ్రేక్ లు సరిగ్గా పడకపోవటంతో ఈ వాహానాలు అదుపు తప్పి పలువురి బలిగొన్న పరిస్థితులు సైతం ఉన్నాయి.