జీహెచ్‌ఎంసీ సంక్షోభంపై నో ఫోకస్

మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని పాలకులు చేసిన ప్రకటనలు ఇప్పట్లో అమలయ్యేలా లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2023-02-17 03:34 GMT

దిశ, సిటీబ్యూరో : మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని పాలకులు చేసిన ప్రకటనలు ఇప్పట్లో అమలయ్యేలా లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు నగరవాసులకు అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు అత్యవసర సేవల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాల్సిన బల్దియాలో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కమిషనర్ మొదలుకుని కామాటి వరకు ఆయా రామ్..గయా రామ్‌గా తయారైంది.

పీకల దాక అప్పుల్లో కూరుకుపోయి కనీసం పేపర్ బిల్లులు, జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థాయికి దిగజారిన జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభం పాలకులు గానీ, పాలకమండలికి గానీ పట్టకపోవటం చర్చనీయాంశంగా మారింది. పైగా రాష్ట్ర బడ్జెట్‌లో కూడా సర్కారు మొండి చేయి చూపటంతో చేసేదేమీ లేక అధికారులు మౌనం వహించారు. ఎలాగో పైసల్లేవ్, కొత్త పనుల్లేవ్, కనీసం రొటీన్ పౌర సేవల నిర్వహణ ప్రక్రియ కూడా సక్రమంగా సాగడం లేదంటూ వివిధ విభాగాల పనితీరుపై ఉన్నతాధికారులకు ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.

కొత్త ప్రాజెక్టుల్లేవ్, రొటీన్ మెయింటనెన్స్ కూడా ముందుకు సాగకపోవడంతో మెజార్టీ విభాగాల్లోని అధికారులు, సిబ్బంది పని లేక గోళ్లు గిల్లుకుంటూ, పక్కనే ఉన్న చాంబర్లలో ముచ్చట్లు పెడుతూ, కాలక్షేపం చేసుకుని ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జీహెచ్ఎంసీ రూ.3 వేల కోట్లను అడిగితే కేవలం రూ.31 కోట్లను కేటాయించింది.

పైగా విశ్వనగరం చేస్తామంటూ రూ.5514 కోట్ల వ్యయంతో రూపొందించిన ఎస్ఆర్ డీపీ-2కు నిధులేమీ కేటాయించలేదంటే విశ్వనగరం చేసే ప్రక్రియ అటెకెక్కిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగులు బడ్జెట్ నుంచి బల్దియా ఖజానా లోటు బడ్జెట్‌కు వచ్చినా, మెయింటనెన్స్ పనుల పేరిట జరుగుతున్న దోపిడీని, అక్రమాలను కూడా అడ్డుకోలేకపోతున్నారు.

దేనికైనా వారే టార్గెట్

జీహెచ్ఎంసీలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా, ఔట్‌సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగులే టార్గెట్ అవుతుంటారు. ఎంతటి అక్రమం, అవినీతి జరిగినా పిచ్చుకలపై బ్రహ్మస్త్రం అన్నట్టు పనికిరాని రూల్స్ మాట్లాడే కొందరు అధికారులు వీరిపైనే చర్యలు చేపట్టి, తమ ప్రతాపాన్ని చాటుకుంటుంటారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నెలకొన్నందున ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఔట్‌సోర్స్ ఎంప్లాయీస్‌ను తగ్గించుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగానే ఔట్‌సోర్స్ ఉద్యోగుల్లో ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగమివ్వాలని 2016లో సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలను తొక్కిపెట్టిన అధికారులు పర్మినెంట్ ఉద్యోగులు, ఔట్‌సోర్స్ ఉద్యోగుల స్థానంలో జరిపే కారుణ్య నియామకాలను సైతం నిలిపివేయాలని కమిషనర్ మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

బతికినంత కాలం అదే సీట్లోనా?

నగరంలోని కూకట్‌పల్లి జోన్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సోమేశ్ కుమార్ కమిషనర్‌గా ఉన్నప్పుడు డిప్యూటీ కమిషనర్ హోదాలో జీహెచ్ఎంసీకి వచ్చిన ప్రస్తుత కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌కు బదిలీలు గానీ, డిప్యూటేషన్ ముగిసిన వెళ్లడం గానీ ఎందుకు జరగటం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

డీసీ నుంచి జోనల్ కమిషనర్ స్థాయికి ఎదిగిన ఇక్కడి జోనల్ కమిషనర్‌కు ఏడాది క్రితం ఎల్బీనగర్ జోన్‌కు బదిలీ అయినా, ఆమె సీటును వదల్లేదు. బతికున్నంత కాలం బల్దియాలోనే ఉంటానని, అదీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గానే ఉంటానని ఆమె పేటెంట్ హక్కులేమైనా తెచ్చుకున్నారా? అని కార్మికులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News