పసుపు ధరలు మరింత పైపైకి

పసుపు రైతుల్లో ఆనందం కనబడుతుంది.

Update: 2024-03-10 11:09 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పసుపు రైతుల్లో ఆనందం కనబడుతుంది. 2011లో పదహారు వేలు దాటిన పసుపు ధర ఇప్పుడు ఆల్ టైం రికార్డులను బద్దలు కొట్టింది . గత వారం రోజుల క్రితం నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధర క్వింటాల్​కు రికార్డు స్థాయిలో రూ. 17011 పలకడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన పోడోళ్ల రాజు అనే రైతుకు సాంగ్లీ మార్కెట్లో 17,503 ధర పలకగా, శనివారం అదే గ్రామానికి చెందిన పాశపు మహేష్ అనే రైతుకు అదే మార్కెట్లో 18,900 ధర పలకడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహబూబ్ నగర్ సమావేశంలో

    ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు ప్రకటన మంజూరు చేయించడం, వెంటనే క్యాబినెట్ లో ఆమోదం తెలపడం, పసుపు బోర్డు కు సంబంధించి గెజిట్ కూడా విడుదలవడం తెలిసిందే. ఈ ప్రకటన తో పసుపు ధరలు గత ఏడాదితో పోల్చుకుంటే ఒక్కసారిగా పెరిగాయి. పసుపు సాగు విస్తీర్ణం గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా పెరిగింది. 2018-19 లో 6,46,947 ఎకరాలు సాగు కాగా, 2022-23 లో 8,04,259 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఐదేళ్లలో 1,57,312 ఎకరాలు పెరిగినప్పటికీ పసుపు ధరలు మాత్రం అమాంతంగా పెరుగుతున్నాయి. గత పది సంవత్సరాల నుండి పసుపు ధరలు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, గతంలో ఎన్నడూ కనీసం 6-7 వేలు ధర మించలేదు. కానీ గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా పసుపు ధరలు పెరుగుతున్నాయని అధికారులు,

    వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. దీనికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2018-19 లో పసుపు ఎగుమతులు 1,33,600 టన్నులు కాగా, 2022-23 నాటికి ఇది 1,70,085 టన్నులకు చేరింది. ఒకవైపు కేంద్రం ఎగుమతులను ప్రోత్సహిస్తూనే, పసుపు దిగుమతులను క్రమ క్రమంగా తగ్గించింది. 2018-19 లో 30,578 టన్నుల పసుపు దిగుమతి చేసుకోగా 2022-23 నాటికి దిగుమతులను 16,769 టన్నులకు తగ్గించింది. ప్రస్తుత ధరలపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పందిస్తూ మునుపెన్నడూ లేనటువంటి విధంగా పసుపు ధరలు మార్కెట్లో ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ క్వింటాలు పసుపు ధరను 20,000 కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

    వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద కేంద్రం నిజామాబాద్ జిల్లాకు పసుపును ఎంపిక చేయడం, రాష్ట్రానికి పసుపు బోర్డు మంజూరు చేయడం, ఎగుమతులను పెంచి దిగుమతులను సగానికి తగ్గించడం, స్పైసెస్ బోర్డు తో పని చేయించడం తదితర కారణాల వల్ల పసుపుకు మంచి ధర లభిస్తుందన్నారు. ప్రస్తుత ధరలను కూడా 20,000 పలికే విధంగా చేసి తమ రికార్డును తామే తిరగరాస్తామన్నారు. గతంలో పని చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పసుపు రైతులను నట్టేట ముంచాయని, సేంద్రీయ ఎరువుల ధరలు, కూలీఖర్చులు మహారాష్ట్రతో పోల్చుకుంటే మూడింతలు ఉండడం , యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేక, వేలాదిమంది యువ రైతులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడం తదితర కారణాల వల్ల జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గిందని, కానీ దేశీయంగా మాత్రం సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. 


Similar News