'ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్క రూపాయి జీతం తీసుకోను'.. ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి

Update: 2023-11-20 12:46 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాజకీయం అంటేనే ఖర్చుతో కూడిన వ్యవహరం. అందునా ప్రజాప్రతినిధి కావాలంటే కోట్లు ఖర్చు కావాల్సిందే. రాజకీయ పార్టీల పదువులు వేరు, ప్రజాప్రతినిధిగా ప్రజాస్వామ్యా పద్దతిలో ఓట్ల ద్వారా ఎన్నిక కావడం వేరు. పార్టీ పదవులు సీనియారిటీ ఆదారంగా లభిస్తే ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఓట్ల ద్వారా తమకు నచ్చిన నాయకున్ని ప్రజాప్రతినిదిగా ఎన్నుకోవడం ఆనవాయితీ. ప్రస్తుతం ఎన్నికలు చాలా కాస్లీ అయిన విషయం తెల్సిందే. సర్పంచ్ పదవి మొదలుకుని ఎమ్మెల్యే పదవులు పొందాలంటే కనీసం కోటి ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఎలక్షన్ కమిషన్ నియమనిబంధనలు మాత్రం రూ.40 లక్షల్లోనే ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు చేయాలని నిబంధన ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో అవి ఏ మూలకు సరిపోవు. ఒకసారి రాజకీయంగా ఎదిగేందుకు పెట్టిన పెట్టుబడిగా ఎన్నికల్లో గెలిచేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేసే నేతలు తర్వాత పెట్టిన ఒక్క పైసాకి రూపాయి వసూల్ చేసే పరిస్థితి ఉన్న విషయం తెల్సిందే. ఇలాంటి పరిస్తితుల్లో గెలిచేందుకు అభ్యర్థులు తమకు తోచిన హామీలు ఇవ్వడం ప్రతి ఎన్నికల్లో జరుగుతునే ఉంటుంది.

2019 ఎన్నికల్లో పార్లమెంట్ లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ తనను గెలిపిస్తే 5 రోజుల్లోనే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చాడు. అందుకు సంబంధించిన బాండ్ పేపర్‌‌ను రాసిచ్చాడు. సంబంధిత పసుపు బోర్డు ఏర్పాటు హామీ పూర్తి చేసేందుకు దాదాపు 5 ఏళ్ళ కాలం పట్టింది. దాంతో గడిచిన ఎన్నికలు తర్వాత మొత్తం అదే బాండ్ పేపర్ గురించి రాజకీయం నడిచింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కలకుంట్ల మధన్ మోహన్ రాసీచ్చినా బాండ్ తో పాటు ఆయన ఇస్తున్న హామీలు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన కలకుంట్ల మధన్ మోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అందరూ వెళ్తున్న దారిలో వెళ్తే తన ప్రత్యేకత ఏముందని అనుకున్నారేమో గానీ ఎన్నికల ప్రచారంలో ఇటీవల తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఎమ్మెల్యే గా ప్రభుత్వం ఇచ్చే జీతం ఒక్క రూపాయి కూడా తీసుకోనని ప్రజలకు హామీ ఇస్తున్నాడు. గత పక్షం రోజులుగా ఇదే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా మధన్ మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలం షట్ పల్లి, సంగారెడ్డి గ్రామస్తులు, యువకులకు ఒక బాండ్ పేపర్ రాసిచ్చాడు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ప్రభుత్వం ద్వారా వచ్చే కాంట్రాక్టు, పథకాల అమలులో గానీ ఒక్క పైసా కమిషన్ తీసుకోకుండా నిస్వార్థంగా పని చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చాడు.

అలా కాకుండా ఒక్క పైసా కమిషన్ తీసుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వంద రూపాయల బాండ్ పేపర్ పై ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల పేరిట రాసిచ్చారు. ఇప్పుడు ఈ బాండ్ వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం మధన్ మోహన్ కాంగ్రెస్ రాజకీయాలను శాసిస్తున్నారని చెప్పాలి. కామారెడ్డి జిల్లాలో మూడు నియోజకవర్గాలపై తనదైన ముద్ర వేసుకున్న మధన్ మోహన్ అక్కడ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

కలకుంట్ల మధన్ మోహన్ ఎల్లారెడ్డి ప్రజలకు రాసిచ్చిన వంద రూపాయల బాండ్ పేపర్ వ్యవహరం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. మధన్ మోహన్ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు నియోజకవర్గ స్థాయి నాయకుడిగా మాత్రమే అందరికీ తెలుసు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన బీబీపాటిల్ కు గెలుపు విషయంలో ముచ్చెమటలు పట్టించారు. తర్వాత కరోనా మహమ్మారి కాలంలో ఆయన కామారెడ్డి జిల్లాలో చేసిన సేవలు మరే లీడర్ కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా ఎల్లారెడ్డి , కామారెడ్డి , బాన్సువాడ నియోజకవర్గాల్లో కరోనాతో పీడింపబడిన ప్రజలకు సేవ చేసేందుకు ఉచిత అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు.

అంతేగాకుండా గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఆక్సిజన్ సేవలందించేందుకు గాను గ్రామాగ్రామానా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయం లేని ప్రాంతాల నుంచి ప్రజలకు రాకపోకల ఇబ్బందులను గుర్తించి ఉచిత వాహన సేవలను అందించారు. అంతేగాకుండా కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సొంతంగా ఎంఎన్ సీలను రప్పించి ఉద్యోగమేళాను నిర్వహించారు. ఎలాంటి అధికారం లేకపోయినా నాయకుడిగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో తోడుండడంతో గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అతన్నే చివరకు అభ్యర్థిగా ప్రకటించింది. అక్కడ ప్రజల్లో ఉన్న మధన్ మోహన్ సేవల గుర్తింపు ద్వారా ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు తాను గెలిస్తే ఏ విధంగా సేవలందిస్తానో తెలిపేందుకే ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చినట్లు మధన్ మోహన్ అనుచరులు చెబుతున్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే వేతనంను తీసుకోకుండా ప్రభుత్వం ద్వారా జరిగే పన్నుల విషయంలో కమిషన్ లకు కక్కుర్తి పడితే నాణ్యత విషయంలో ప్రమాణాల విషయంలో రాజీపడొద్దని బాండ్ పేపర్ ద్వారా ప్రజలకు నేరుగా తాను ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాసిచ్చారని ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News