విదేశాలకు పంపిస్తానని రూ. 2 కోట్లతో ప్రిన్సిపాల్ పరారీ

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్ ఏరియాలో ప్రముఖ ఓ కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తూ 2 కోట్ల రూపాయల నగదు వసూలు చేసి పరారైన విషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2023-12-23 15:38 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్ ఏరియాలో ప్రముఖ ఓ కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తూ 2 కోట్ల రూపాయల నగదు వసూలు చేసి పరారైన విషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ పట్టణంలోని ఓ కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపాల్ డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా అక్రమ మార్గాలు, అడ్డదారులు తొక్కి నిరుద్యోగ యువకులు, పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఆర్మూర్ ను వదిలి పరారైనట్లు తెలిసింది. ఆర్మూర్ మున్సిపల్ పెర్కిట్ లోని ఓ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థ లో నిందితుడు ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు.

    అంతకు ముందు ఆర్మూర్ లోని మరో పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. ఏడాది క్రితం పెర్కిట్ లో ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థకు చెందిన బ్రాంచి పాఠశాలను ప్రారంభించారు. వివిధ పాఠశాలల్లో ప్రిన్సిపాల్ గా పనిచేసిన అనుభవం ఉన్నందున ఆ వ్యక్తిని అధిక వేతనం ఇస్తామని చెప్పి ప్రిన్సిపాల్ గా ఆ కార్పొరేట్ సంస్థ నియమించుకుంది. ప్రముఖ, పేరు ప్రఖ్యాతులు గల విద్యా సంస్థ కావడంతో ఆర్మూర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి పిల్లల్ని ఆ కార్పొరేట్ పాఠశాలలో చేర్పించారు. ఈ పరిచయాలతో నిరుద్యోగులను దుబాయ్ కు పంపిస్తానని డబ్బులు వసూలు చేశాడు. దుబాయిలో మంచి ఉద్యోగాలు ఉంటాయని నిరుద్యోగులకు నమ్మ బలికాడు. కొందరిని గల్ఫ్ కు పంపించగా అక్కడ ఉద్యోగ అవకాశాలు లేనందున నిరుద్యోగులు స్వదేశానికి తిరిగి వచ్చి తమ డబ్బులు ఇవ్వాలని ప్రిన్సిపాల్ ని నిలదీశారు.

     అలాగే ఈయన పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి రూ.30 లక్షల నుంచి 50 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి తీసుకున్న డబ్బులు 2 కోట్లకు పైగా అప్పులు కావడంతో చెల్లించే పరిస్థితి లేకపోవడంతో పరారైనట్లు ఆలస్యంగా తెలిసింది. పాఠశాలలో ప్రిన్సిపాల్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. మొదట్లో ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు

    సైతం విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ప్రిన్సిపాల్ డబ్బులు తీసుకున్న విషయం తెలియలేదు. ప్రిన్సిపాల్ పాఠశాలకు రాకపోవడం, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజూ వచ్చి ప్రశ్నించడంతో పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ గురించి వివరాలు సేకరించినట్లు తెలుస్తుంది. కానీ అప్పటికే ఆలస్యం జరగడంతో ప్రిన్సిపాల్ పరారయ్యాడు. ఈ విషయమై బాధితులు పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించగా తమకు సంబంధం లేదని చెప్పారు. కాగా బాధితులు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడం కొసమెరుపు. 


Similar News