కేసీఆర్ పై ఈడీ విచారణ ఎందుకు చేయదు
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాకపోతే కేసీఆర్ అవినీతిపై ఈడీ విచారణ ఎందుకు చేయదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
దిశ, కామారెడ్డి : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాకపోతే కేసీఆర్ అవినీతిపై ఈడీ విచారణ ఎందుకు చేయదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉందని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. తాను స్వయంగా ప్రాజెక్టును సందర్శించానని, ప్రాజెక్టు మొత్తం కుంగిపోయిందన్నారు. సాగునీటి కోసం ప్రాజెక్టు చేపట్టలేదని, ధనార్జన కోసమే నిర్మించారన్నారు. ధరణి పోర్టల్ ద్వారా 20 లక్షల ఎకరాల భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 8 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
నిరుద్యోగులు లక్షలు ఖర్చు చేసి ప్రిపేరయి పరీక్షలు రాసిన తర్వాత ప్రశ్నాపత్రాలు లీకేజీ చేశారని నిరుద్యోగులు తనతో చెప్పుకున్నారన్నారు. కేసీఆర్ బంధువులు, మిత్రుల పిల్లలు పరీక్షలు రాస్తే ఉత్తీర్ణత సాధిస్తారని, ఆ అవకాశం నిరుద్యోగ యువతకు లేదన్నారు. కాంగ్రెస్ ఏమి చేసిందని కేసీఆర్ పదేపదే అడుగుతున్నారని, కేసీఆర్ నడుస్తున్న రోడ్లన్నీ కాంగ్రెస్ వేసినవేనన్నారు. కేసీఆర్ చదువుకున్న పాఠశాల, విశ్వవిద్యాలయం కాంగ్రెస్ కట్టినవేనని, హైదరాబాదును విశ్వనగరంగా తీర్చి దిద్దింది కాంగ్రెస్ అని తెలిపారు. అక్కడ మోడీ ఏది అంటే ఇక్కడ కేసీఆర్ అదే అంటారని, పార్లమెంటులో కేంద్రం తెచ్చిన బిల్లులన్నింటికి కేసీఆర్ మద్దతిస్తారన్నారు. మోడీకి వ్యతిరేకంగా తాను పోరాడుతానని, అందుకే తనపై 24 కేసులు బనాయించారన్నారు. 55 గంటల.. 5 రోజుల పాటు అర్ధరాత్రి 2 గంటల వరకు ఈడీని ప్రయోగించారన్నారు. తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, తన ఇల్లు లాక్కుంటే తీసుకొమ్మని చెప్పానని, తనకు ఇల్లు వద్దని,
దేశంలో కోట్లాది ఇండ్లు తనకు ఉన్నాయని చెప్పానన్నారు. మోడీ బీసీ సీఎం చేస్తామని చెప్తున్నారని ముందు ఓట్లు తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. కారులో నాలుగు టైర్లలో గాలి తీసి పడేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ గాలి తీసిందని చెప్పారు. ఇప్పుడు బీజేపీ పని అయిపోయిందని, అందుకే కేసీఆర్ కు మద్దతిస్తున్నారన్నారు. కేసీఆర్, మోడీకి ఎంఐఎం మిత్రపక్షమని అందుకే కాంగ్రెస్ సీఎం గా గెలిచే స్థానాల్లో ఎంఐఎంతో కలిసి ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో గెలిచాక అక్కడ ప్రజల నుంచి ప్రభుత్వం దోచుకున్న డబ్బును ప్రజలకే ఇవ్వాలని చెప్పామన్నారు. అందుకే తెలంగాణలో ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చామని, అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలు ఆరు చట్టాలుగా మారుస్తామన్నారు. మొదటి గ్యారెంటీగా మహిళలకు నెలకు 2500 ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని, కర్ణాటకలో మాదిరిగా ఉచిత బస్సు వసతి కల్పిస్తామన్నారు.
రైతు భరోస స్కీం ద్వారా ఏడాదికి ఎకరానికి 15 వేల రూపాయలు రైతులకు సాయంగా ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల సహాయం అందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారుల కుటుంబానిక్ 250 గజాల స్థలాన్ని కేటాయిస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం చరిత్మాత్మక నిర్ణయం తీసుకున్నామని, విద్యా భరోసా కార్డు ద్వారా విద్యకు 5 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామన్నారు. చేయూత పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులకు 4 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఇవన్నీ మొదటి కేబినెట్ లోనే నిర్ణయం తీసుకుంటామని, ప్రజల తెలంగాణ కలను సాకారం చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, అత్యధిక మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.